పార్టీ వీడనున్న కీలక నేత.. సిరిసిల్లలో కేటీఆర్‌కు షాక్!
రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీజేపి పార్టీ చాప కింద నీరులా తమ పని తాము కానిచ్చుకుపోతుంది.
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీజేపి పార్టీ చాప కింద నీరులా తమ పని తాము కానిచ్చుకుపోతుంది. సైలెంట్గా ఉంటునే టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపి లీడర్లు కార్యరూపం దాల్చుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాకాపై దృష్టి సారించింది. టీఆర్ఎస్ పార్టీలో జిల్లా నాయకత్వ లోపంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో నేతలున్నారు. టీఆర్ఎస్‌లో కనీస గౌరవానికి నోచుకోక.. సిరిసిల్ల టీఆర్ఎస్ నేతల అజమాయిషీని జీర్ణించుకోలేని కొంత మంది టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ మారే యోచనలో ఉన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన సెస్ మాజీ వైస్ చైర్మన్, సామాజిక సేవా కార్యకర్త లగిశెట్టి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపి తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు విశ్వసనీయం సమాచారం.
పూర్తయిన సంప్రదింపులు..
ఇప్పటికే పలువార్డుల్లో పద్మశాలీ యూత్ నేతలతో సమావేశమైన లగిశెట్టి శ్రీనివాస్ పలువురు అసంతృప్తి కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి బీజేపిలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను సైతం కలిసి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. సెస్ ఎన్నికలకు ముందే సిరిసిల్లలో బీజేపి పార్టీలో భారీ చేరికలకు నేతలు స్కెచ్ వేసి బండి సంజయ్ సభను నిర్వహించేందుకు జిల్లా నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సిరిసిల్ల టీఆర్ఎస్ నేత లగిశెట్టి శ్రీనివాస్‌తో పాటు పలువురు బీజేపిలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ నేత లగిశెట్టి శ్రీనివాస్ బీజేపి, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు కలిసి చర్చించినట్లు సమాచారం.
పలువురు పద్మశాలీ నాయకులు, యూత్ నేతలు మాత్రం బీజేపిలో జాయిన్ కావాలని సూచిస్తున్నట్లు తెలిసింది. మూడేళ్లుగా అసంతృప్తిగా ఉన్న లగిశెట్టి శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి వరకు ఆయనతో చర్చించిన దాఖాలాలు లేవు. లగిశెట్టి పార్టీ మారేంత సీన్ లేదంటూ టీఆర్ఎస్ నేతలే లూజ్ కామెంట్లు చేస్తుండటం.. లగిశెట్టి మద్దతు దారులు పార్టీ మార్పుపై ఒత్తిడి తీసుకోస్తుండటంతో పార్టీ మారేందుకు ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సిరిసిల్లలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా.. పద్మశాలీ సామాజిక వర్గ నేతగా సిరిసిల్లలో లగిశెట్టికి మంచి పేరుంది.
పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పేరు..
ప్రస్తుతం పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ సిరిసిల్ల లో శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేసి వృద్ధాశ్రయం నిర్వహణతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014 లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించి మంత్రి కేటీఆర్ కోసం వెనకడుగు వేసి టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. టీఆర్ఎస్‌లో పలువురు నేతలు లగిశెట్టిని విస్మరించడం, ప్రస్తుతం నామినేట్ పోస్టులో ఉన్న నేతతో విభేదాలు చోటు చేసుకోవడంతో పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు పలు సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తె కేటీఆర్ స్పందించలేదన్న ఆవేదనతో మూడేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు వస్తున్నారు. టీఆర్ఎస్ ఓ వర్గం లగెశెట్టిని బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నేత లగిశెట్టి శ్రీనివాస్ పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.