జాతీయ రాజకీయాల వేళ KCRకు కొత్త సెంటిమెంట్?

సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఓ పట్టాన అంతుచిక్కవు. ప్రత్యర్థులను చిక్కుల్లో పెడుతూ తాను వేసే అడుగులను అందుకోవడం

Update: 2022-12-14 10:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఓ పట్టాన అంతుచిక్కవు. ప్రత్యర్థులను చిక్కుల్లో పెడుతూ తాను వేసే అడుగులను అందుకోవడంలో తలలు పండిన రాజకీయ నేతలకు సైతం సవాలుగా ఉంటుందనే టాక్ ఉంది. అయితే రాజకీయ వ్యూహ రచనలో సిద్ధిహస్తుడిగా అందరి ప్రశంసలు అందుకునే కేసీఆర్‌కు ముహుర్తాలు, రాశులు, వాస్తు, తిథి తదితర అంశాల పట్ల ఎంతటి విశ్వాసం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ పనినైనా పక్కాగా లెక్కలు వేసుకుంటారని, తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల వెనుక తన విశ్వాసాలు, నమ్మకాలకు విలువనిస్తారు అనే ప్రచారం ఉంది. ఈ విషయంలో మూఢనమ్మకాల ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్షాలు ఎంత విమర్శించినా ఆయన మాత్రం తన తీరు మార్చుకోలేదు. గతంలో కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాల వెనుక సెంటిమెంట్‌కు సంబంధించిన రీజన్ ఉందనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. తాజాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాగా ఈ సందర్భంగా కేసీఆర్ మరో కొత్త సెంటిమెంట్‌ను నమ్ముకున్నారా? అనే అంశం జోరుగా వినిపిస్తోంది. ఇందుకు బలం చేకూరేలా కేసీఆర్ వ్యవహరించడం హాట్ టాపిక్‌గా మారింది.

జాతీయ రాజకీయాల వేళ కేసీఆర్‌కు 'క్యాప్ సెంటిమెంట్'?

పైకి సింపుల్‌గా కనిపించే ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని విషయాల్లో పట్టింపులతో ఉన్నట్టుగా కనిపిస్తారు. ముఖ్యంగా గతంలో ఆయన ఢిల్లీలో ఎప్పుడు పర్యటించిన ఆయన డ్రెస్ కోడ్ మారిపోయేది. రాష్ట్రంలో ఉన్నప్పుడు తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ తో కనిపించే కేసీఆర్.. ఢిల్లీ టూర్ అనగానే వైట్ షర్ట్ పై రెడ్ కలర్ స్వెటర్, రెడ్ కలర్ శాలువాతో దర్శనం ఇచ్చేవారు. ఇదే ఆహార్యంతో ప్రధానితో పాటు పలువురు మంత్రులను కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే బుధవారం ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కేసీఆర్ తలపై నుంచి టోపీ తీయకపోవడం చర్చనీయాశంగా మారింది. పూజాలు నిర్వహిస్తున్న సమయంలోనూ ముఖ్యమంత్రి తలపై టోపీనే ధరించి ఉన్నారు. నిజానికి గతంలో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు మాత్రమే ఆయన ఈ రకమైన టోపీని ధరించే వారు. కానీ జాతీయ రాజకీయాల్లోకి ఆలోచన మొదలైనప్పటి నుంచి వివిధ జిల్లాల పర్యటనలతో పాటు పబ్లిక్ మీంటింగ్ లోనూ ఆయన తలపై టోపీని ధరించే కనిపిస్తున్నారు. తెలంగాణకు హరిత హారం అనే ట్యాగ్ లైన్ తో ఉండే ఈ టోపీని తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సమయంలోనూ ధరించి ఉండటం వెనుక కేసీఆర్ టోపీ సెంటిమెంట్ ను నమ్ముకున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో పాటు ఈ సారి కేసీఆర్ ఢిల్లీ టూర్ లో మరో విశేషం కూడా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ నయా లుక్ లో కనిపించారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఢిల్లీలో కోట్ ధరించి కనిపించేవారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ తరహా డ్రస్ కోడ్ ఉపయోగించలేదు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా తిరిగి కోట్ ధరించడం అందరిని ఆకర్షించింది. జాతీయ రాజకీయాల వేళ కేసీఆర్ విషయంలో ఈ మార్పుల వెనుక ఏదైనా సెంటిమెంట్ ఉందా లేక యాదృచ్ఛికంగా జరిగాయా అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News