హైదరాబాద్ లో ఆ ప్రాంతానికి కొత్త పేరు..సోషల్ మీడియాలో ఫోటో వైరల్

సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో తెలంగాణలోని పట్టణాలు, నగరాల పేరు మార్పు అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-03-06 07:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో తెలంగాణలోని పట్టణాలు, నగరాల పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి వస్తోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూసాపేట ప్రాంతం పేరును మస్కిపేట గా పేర్కొంటూ ఓ బోర్డు దర్శనం ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇందుకు సంబధించిన ఫోటోను ఓ నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దీనిపై హాట్ టాపిక్ గా మారింది. తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ సహా పలు నగరాల పేర్లు మారుస్తామని చాలా కాలంగా బీజేపీ చెబుతూ వస్తోంది. ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్ పై టీఎస్ స్థానంలో టీజీగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ అసెంబ్లీ వేదికగా హైదరాబాద్ సహా పలు పట్టణాల పేర్లను సైతం మార్చాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ స్థానంలో భాగ్యనగరం, నిజామాబాద్ పేరును ఇందూరు, ఆదిలాబాద్ ను ఎదులాపురం, మహబూబ్ నగర్ ను పాలమూరు, వరంగల్ ను ఓరుగల్లు, కరీంగనర్ ను కరిపురంగా మార్చాలని కమల దళం డిమాండ్ చేస్తోంది. ఇన్నాళ్లు ఈ డిమాండ్ బీజేపీ నేతల ప్రసంగాలు, ప్రకటనల వరకే పరిమితం కాగా ఇప్పుడు తమ డిమాండ్లను బస్తీ స్థాయిలోకి విస్తరించడం సంచలనంగా మారుతున్నది.

లోక్ సభ ప్రచారంలో మరింత విస్తృతంగా:

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ ఈ అంశాన్ని మరింత విస్తృతంగా తమ ప్రచారాస్త్రంగా మలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ స్థానంపై గురిపెట్టిన కమలనాధులు అక్కడ అసద్ పై నేమ్ గేమ్ ను మరింత బూస్టప్ చేయనున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఈ నేమ్ గేమ్ పాలిటిక్స్ పార్టీలకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

Tags:    

Similar News