TS: గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతి జరిగిదంటూ గతకొన్ని రోజులుగా వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతి జరిగిదంటూ గతకొన్ని రోజులుగా వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన నలుగురు అధికారులను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవి, మేడ్చల్ పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్‌లను గురువారం అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఈ స్కామ్ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీస్ అధికారులు ఏసీబీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.