దీప్తి మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి సొంత చెల్లెలే..

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి

Update: 2023-09-02 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసింది ఎవరనేది చేధించారు. దీప్తి సొంత చెల్లెలు చందనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. చందన తన ప్రియుడితో కలిసి అక్క దీప్తిని హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. శుక్రవారం చందనతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తామే హత్య చేసినట్లు వారిద్దరు శనివారం నేరం ఒప్పుకున్నారు.

ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. బీటెక్ చదవుకునే సమయంలో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితుడిని చందన ప్రేమించింది. అప్పటినుంచి వీరి ప్రేమ వ్యవహారం నడుస్తుండగా.. వీరిద్దరు ఇటీవల పెళ్లి చేసువాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చందన తన తల్లిదండ్రులు, అక్కకు చెప్పింది. కానీ మతాంతర వివాహానికి చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ఒప్పుకోలేదు. దీంతో తమ ప్రేమకు అడ్డు పడుతుందనే కోపంలో సొంత అక్క దీప్తిని ప్రియుడితో కలిసి చందన చంపేసింది. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లడంతో మంగళవారం రాత్రి దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో తన ప్రియుడిని చందన ఇంటికి పిలిచింది. ఈ సందర్బంగా దీప్తి, చందన మందు పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ దీప్తి శవమై  కనిపించగా.. చందన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పరార్ అయింది.

ఇంట్లోని డబ్బులు, బంగారం తీసుకుని ప్రియుడి కలిసి చందన పరారైంది. దీంతో వారిద్దరు కలిసే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన చందన.. తన తమ్ముడు సాయికి వాట్సప్‌లో ఒక మెసేజ్ పెట్టింది. అక్కను తాను చంపలేదని, డబ్బులు, గోల్డ్ తీసుకుని ఇంటి నుంచి వచ్చినట్లు వాయిస్ మెసేజ్ పెట్టింది. అనంతరం చందన, ఆమె ప్రియుడు ఫోన్లు స్విఛ్చాఫ్ చేసుకున్నారు. చివరికి ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్రేస్ చేసి చందన, ఆమె ప్రియుడిని శుక్రవారం ఒంగోలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని విచారించగా తాము చంపలేదని చెప్పుకొచ్చారు. తర్వాత పోలీసులు తమదైన స్ట్రైల్‌లో విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


Similar News