ప్రకాశ్ అంబేద్కర్‌తో కేసీఆర్ భారీ స్కెచ్.. బీఆర్ఎస్‌లో ‘కీ’ రోల్?

బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు రానున్న కాలంలో ప్రకాశ్ అంబేడ్కర్‌ సేవలను వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Update: 2023-04-15 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు రానున్న కాలంలో ప్రకాశ్ అంబేడ్కర్‌ సేవలను వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీ యాక్టివిటీస్‌ను బలోపేతం చేయాలనుకుంటున్నందున ఆ రాష్ట్రానికి చెందిన ప్రకాశ్ అంబేడ్కర్ ఒక ఫేస్‌గా పనికొస్తారనే అంచనాకు వచ్చినట్లు ఆ పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రధాన నగరాలకు ఇన్‌చార్జిలను ప్రకటించిన కేసీఆర్ ఇకపైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడిగా ప్రకాశ్‌ను ఒక అస్త్రంగా వాడుకోవాలనే ప్లాన్ సిద్ధమైనట్లు తెలిసింది. భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లోనూ దళిత్ ఇమేజ్‌గా ఆయన సేవలను వాడుకునే అవకాశమున్నది. అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత నేషనల్ లీడర్ తనకు ఎవ్వరూ కనబడలేదని, ప్రాంతీయ నాయకులే ఉన్నారని చెప్తూ పరోక్షంగా కేసీఆర్ ఆ స్థాయికి తగినవారని వ్యాఖ్యానించడం గమనార్హం.

“అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో వినూత్న పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ తన ఆలోచనలతో దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా మారాలి... కేసీఆర్ ముందడుగు వేస్తే మిగిలినవారూ అనుసరిస్తారు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారాలి.. వినూత్న పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ ఇప్పుడు దేశానికి మార్గదర్శిగా మారాలి” అని ప్రకాశ్ అంబేడ్కర్ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని తీరులో వినూత్నంగా దళితబందు స్కీమ్‌ను అమలు చేయడాన్ని కీర్తించారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, పేద దళితుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పుకు తొలి అడుగు అని అభివర్ణించారు.

బీఆర్ ఆంబేడ్కర్ మనుమడిగా ప్రకాశ్‌కు ఉన్న గుర్తింపును మహారాష్ట్రతో పాటు పలు ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల్లో వాడుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. కేసీఆర్ పట్ల ఆయనకు నిశ్చితమైన అభిప్రాయం ఉన్నందున బీఆర్ అంబేద్కర్ మనుమడిగానే కాక ఒక మేధావిగా, మాజీ ఎంపీగా, దళిత్ ఫేస్‌గా ఆయనను బీఆర్ఎస్ విస్తరణ కార్యకలాపాలకు వాడుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్ మీద కూడా ప్రకాశ్‌కు కొన్ని అంచనాలు ఉన్నాయని ఆయన ప్రసంగం ద్వారానే అర్థమవుతున్నది. రూపాయి విలువను స్థిరీకరించేలా కేసీఆర్ చర్యలు తీసుకోవాలని.. దేశ ఆర్థిక వ్యవస్థలోని లోపాన్ని చక్కదిద్దడానికి చొరవ తీసుకోవాలని.. అప్పుడు మరికొద్దిమంది ముఖ్యమంత్రులూ ఆయన వెంట నడుస్తారని ప్రకాశ్ తన ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని గులాబీ నేతలు గుర్తుచేస్తున్నారు.

పరస్పర ప్రయోజనాల ఆధారంగా ప్రకాశ్, కేసీఆర్ మధ్య రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ యాక్టివిటీస్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. మహారాష్ట్రపై దృష్టి పెట్టిన కేసీఆర్ త్వరలో అక్కడ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు స్వయంగా ఆయనే చెప్పారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశ్‌కు ఉన్న గుర్తింపునకు అనుగుణంగా ఆయనను బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ ఉపయోగించుకునే అవకాశమున్నది. కేసీఆర్ రాజకీయ పరిణతిపై ప్రకాశ్‌కు స్పష్టమైన అంచనా ఉన్నందున దానికి తగినట్లుగానే ఆయన వంతు సహకారాన్ని అందిస్తారనే నమ్మకం బీఆర్ఎస్‌లో వ్యక్తమవుతున్నది. అందువల్లనే కేసీఆర్‌ను తన ప్రసంగంలో ప్రశంసించారని, దానికి తగినట్లే భవిష్యత్తులో సహకారం ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని దళిత ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ప్రకాశ్ అంబేడ్కర్ సేవలను ఏ రూపంలో వాడుకుంటే ప్రయోజనం ఉంటుందో సమీప భవిష్యత్తులో ప్లాన్ చేసుకునే ఆలోచన గులాబీ పార్టీలో వ్యక్తమవుతున్నది. ఆ రాష్ట్రాల్లో ప్రకాశ్ అంబేడ్కర్‌గా మహారాష్ట్రతో పోలిస్తే తక్కువ గుర్తింపే ఉన్నప్పటికీ దళిత సెంటిమెంట్‌తో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఆ సెక్షన్ ఓటర్లకు చేరువ కావాలనే ప్లాన్ బీఆర్ఎస్‌లో ఉన్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీకి మెరుగుపడే అంశాలను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర నుంచి పోటీ చేయడానికి ప్రకాశ్ అంబేడ్కర్‌కు కేసీఆర్ అవకాశం కల్పిస్తారా లేక తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్‌ను అంబేడ్కర్‌వాదిగా కొనియాడిన ప్రకాశ్.. జయంతిని వినూత్నంగా నిర్వహించారని కామెంట్ చేశారు. బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను కేసీఆర్ ఆచరణలో చూపిస్తున్నారని, వివిధ స్కీమ్‌ల అమలుతో ప్రజల్లో విశ్వాసం కలిగిస్తున్నారని ప్రస్తావించారు. అంబేడ్కర్ ఆలోచనలతో సరికొత్త జ్యోతిని వెలిగించారని అన్నారు. కులమతాల ఆధారంగా ప్రస్తుతం దేశంలో రాజకీయాలు నడుస్తున్నాయని, హిందు-ముస్లిం విభజన ఏర్పడిందని, నిఖార్సయిన జాతీయ నాయకులు కనిపించని పరిస్థితుల్లో కేసీఆర్‌ ఒక జాతీయ నాయకుడిగా ఎదగడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయని పరోక్షంగా వ్యాఖ్యనించడం విశేషం. పరస్పర ప్రయోజనాలతో రానున్న కాలంలో కేసీఆర్, ప్రకాశ్ అంబేడ్కర్ మధ్య సంబంధాలు బీఆర్ఎస్‌కు ఉపయోగపడేవిగా ఉంటాయనే చర్చలు గులాబీ నేతల మధ్య జరుతున్నాయి.

Tags:    

Similar News