స్కూళ్లో ఉపాధ్యాయుడి దురుసు ప్రవర్తన.. కేసు నమోదు
విధులకు సక్రమంగా రాకుండా విద్యార్థులకు పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యం చేస్తోన్న ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ వ్యవహారంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.
దిశ, కరీంనగర్: విధులకు సక్రమంగా రాకుండా విద్యార్థులకు పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యం చేస్తోన్న ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ వ్యవహారంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ వ్యవహరశైలిపై గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి హెడ్ మాస్టర్ నీరజ చెప్పినట్టుగా విధులు నిర్వర్తించకుండా ఆమె పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. తనకన్నా జూనియర్ అని, తక్కువ సామాజిక వర్గానికి చెందిన హెడ్ మాస్టర్ చెప్తే తానేంటి వినేది అన్నట్టుగా నడుచుకుంటున్న శివప్రసాద్‌ను గ్రామస్తులు పాఠశాల ఆవరణలో నిలదీశారు. ఆఫీసు రూంలో ఉన్న ఆయనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు టీచరపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది కూడా పాఠశాలకు సక్రమంగా రాకపోవడంతో తాము గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకున్నామన్నారు. ఈ సమాచారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు టీచర్‌పై శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ఉపాధ్యాయుడు శివప్రసాద్‌పై హెడ్ మాస్టర్ నీరజ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు.