BRSకు దిమ్మదిరిగే షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేల ఓటమికి కారణాలివే..!

నిజామాబాద్ జిల్లాలో ఆరు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటమి చెందడం అపార్టీ నాయకత్వానికి షాక్ గురి చేసింది.

Update: 2023-12-05 02:59 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆరు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటమి చెందడం అపార్టీ నాయకత్వానికి షాక్ గురి చేసింది. ఉమ్మడి జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మినహా మిగిలిన సిట్టింగ్‌లు ఓటమి పాలుకావడం అపార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఏకంగా సీయం కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలో అయన ఓడిపోవడంతో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితులకు అద్ధం పడుతున్నాయి.

హ్యాట్రిక్‌లపై కన్నేసిన వారు కొందరు ఐతే, ఈ సారి గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని అశపడ్డవారికి ప్రజలు ఓటు దెబ్బ రూచి చూపించడంతో బీఆర్ఎస్ నేతల భవితవ్యం అంతా తలకిందులైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయాలలో ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఓటమి పాలు కావడం ఓకెత్తు అయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన నేతలు ఈ సారి హ్యాట్రిక్ గ్యారంటి అంటూ ప్రచారం చేసుకుని గెలుపు తీరాలకు చేరకుండా ఏకంగా మూడో స్థానానికి పరిమితం కావడం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఇక గడ్డు పరిస్థితులు తప్పవని చెప్పకనే చెబుతున్నాయి.

మార్పు పేరుతో కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలిచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చావు దెబ్బ కొట్టగా, బీజేపీ నుంచి పోటీ చేసిన కొత్త నాయకులు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మూడోస్థానానికి పరిమితం చేయడం ఆపార్టీ నాయకత్వానికి విస్మయానికి గురిచేసిందని చెప్పాలి.

ఓటమి పాలైన బాజరెడ్డి గోవర్ధన్​

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ షాక్ తగిలినట్లయింది. గత ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన భూపతిరెడ్డి చేతిలో ఓటమి పాలు కావడం ఆయన రాజకీయ భవిష్యత్​కు ప్రభావం చూపింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో తనకు ఎదురు లేదనుకున్న బాజిరెడ్డికి సొంత నియోజకవర్గంలో ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్యాకేజీ 21 ముంపు బాధితులు మోపాల్ మండలంతో పాటు ఇతర మండలాల్లో బాజిరెడ్డికి వ్యతిరేకంగా పని చేశారు. గడిచిన ఎన్నికల్లో ఓడిన భూపతిరెడ్డికి సానుభూతి పని చేసింది. గ్రామాలలో దళితబంధు రాని ప్రజలు బాజిరెడ్డిని ప్రచారంతో పాటు ఇతర కార్యక్రమాల సమయంలో అడ్డుకున్నారు. బాజిరెడ్డి తర్వాత నియోజకవర్గంలో నాయకత్వలోపం ఆయన ఓటమికి కారణమని చెప్పాలి. అంతేగాకుండా ఆర్టీసీ చైర్మన్ గా పని చేసిన వారు ఓటమి పాలవ్వడం అనేది వస్తున్న సాంప్రదాయం బాజిరెడ్డికి శాపంగా మారింది.

జీవన్​రెడ్డికి ఘోర పరాజయం

నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు, ఆర్మూర్ ఎమ్మెల్మే జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఏకంగా మూడవస్థానానికి దిగజారడం గమనార్హం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జీవన్ రెడ్డికి నందిపేట మండలంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.గ్రామాలలో జీవన్ రెడ్డి రాకుండా ఉండేందుకు ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని కూడా అడ్డుకున్నారు. జీవన్ రెడ్డి దౌర్జన్య రాజకీయం కారణంగా పలువురిపై అక్రమ కేసులు కూడా కారణమని చెప్పాలి. అంతేగాకుండా హైదరాబాద్ లో భూ అక్రమణ గురించి నియోజకవర్గంలో ప్రచారం జరిగింది.

పలువురు ప్రతిపక్షాల నాయకులను అక్రమంగా కేసులలో ఇరికించడం ప్రజల్లో జీవన్ రెడ్డి పట్ల సానుభూతి లేకుండా పోయింది. 2014లో గెలిచిన జీవన్ రెడ్డికి రెండవసారి 2018లో గెలిచిన జీవన్ రెడ్డికి చాలా తేడా ఉందని ప్రచారం జరిగింది. సొంత పార్టీ నాయకులను వేధించిన ఉదంతాలు ఉన్నాయి. తనపై హత్యాయత్నం చేసిన వారిపై జీవన్ రెడ్డి వేధింపు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది. నియోజకవర్గంలో అన్న తర్వాత తమ్ముడి రాజకీయం ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదుగకుండా చేసిందని సొంత పార్టీ నేతలే జీవన్ రెడ్డికి ఎన్నికల్లో సహకరించలేదనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ నుంచి గెలుపు కోసం డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేసినా మూడవ స్థానానికి పరిమితం కావడం జీవన్ రెడ్డి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

షకీల్​ ఓటమికి వ్యవహారశైలేనా..?

బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ ఓటమికి ఆయన వ్యవహార శైలి కారణమన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులను కేసులతో వేదించడమే కాకుండా వారిని పార్టీని నుంచి వెళ్లిపోయేలా చేసినందుకే అక్కడ ఆయనకు పరాజయం ఎదురయిందని చెప్పాలి. అంతేగాకుండా సొంత నియోజకవర్గం నుంచి చేసిన ఇసుక అక్రమ రవాణాలో షకీల్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరోపణలున్నాయి.

నియోజకవర్గంలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ మజ్లీస్ పార్టీ నాయకులతో జరిగిన గొడవలో ఆయనకు సహకరించలేదని చెప్పాలి. అంతేగాకుండా నియోజకవర్గం కేంద్రంగా జరిగే సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్) రైస్ వ్యవహారంలో షకీల్ పాత్రపై బహిరంగ విమర్శలున్నాయి. రైస్ మిల్ దందాను తన గుప్పిట్లో పెట్టుకుని ఇతర రైస్ మిల్ వ్యాపారులను వేధిస్తున్నాడని వారు ఏకమై షకీల్ ఓటమికి కారణమయ్యారనే వాదనలున్నాయి. నియోజకవర్గంలో కస్టోడియన్ భూములను చెరబట్టాడనే వాదనలు ఉన్నాయి.

జాజుల సురేందర్ ఓటమికి కారణం క్యాడరేనా..?

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి చేరిన విషయం తెల్సిందే. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన సురేందర్ కు అప్పటి వరకు అతనికి ఎదురైన ఓటమితో సానుభూతితో ప్రజలు స్వచ్చందంగా గెలిపించారు. కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్ లో చేరడంతో క్యాడర్ ఎవరు ఆయనతో రాకపోవడం పెద్ద దెబ్బగా చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో డెవలప్ మెంట్ కుంటుపడిందనే ఆరోపణలున్నాయి.

సదాశివనగర్‌లో జూట్ పరిశ్రమ కోసం భూముల సేకరణలో రైతులు తమ భూములు పోయాయని ఆందోళన చేయడం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన రెండు గ్రామాల ప్రజల భూములు కోల్పోయినప్పుడు స్పందించలేదనేది ఆరోపణలున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న కాయితి లంబాడీలు సహకరించలేదని విమర్శలున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేందర్ హైదరాబాద్ కు పరిమితం కావడం, ఆదివారం ఎవరికి అందుబాటులో ఉండడనే అపవాదును మూటగట్టుకున్నారు. ఆయన వెంట ఉండే క్యాడర్ ఈ ఎన్నికల్లో సురేందర్ గెలుపు కోసం కాకుండా వెన్నుపోటు పొడిచారనే వాదనలున్నాయి.

హన్మంత్ షిండే ఓటమికి అంతర్గత విభేదాలే కారణమా..

జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ షిండే ఓటమికి అక్కడ పార్టీలో అంతర్గత విభేదాలు కారణమని వాదనలున్నాయి. పిట్లం మండలంలో ఏకంగా రెండు, మూడు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేనే బహిష్కరించారు. పలు గ్రామాల్లో డెవలప్ మెంట్ పనులు జరుగలేదని హన్మంత్ షిండేను ప్రచారంలో అడ్డుకున్నారు.

దళితబంధు స్కీంను నిజాంసాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసినప్పుడు దళితబంధు స్కీంలో లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలున్నాయి. అంతేగాకుండా మంజీరా పరివాహక ప్రాంతంలో నియోజకవర్గం పరిధిలో జరిగే ఇసుక తవ్వకాల పాపం షిండేను వెంటాడిందనే వాదనలున్నాయి. నియోజకవర్గంలో తనకు ఎదురు లేదనుకున్నా షిండేకు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన లక్ష్మీకాంత్ రావు షాక్ ఇస్తాడని ఆయన ఊహించనే లేదు.

గణేష్ గుప్త ఓటమికి మజ్లిసేనా..?

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గణేష్ గుప్త ఓటమి బీఆర్ఎస్ శ్రేణుల సహకారం లేకపోవడమేనన్న వాదనలు ఉన్నాయి. అతీగా నమ్మిన మజ్లీస్ కార్పొరేటర్లు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో షబ్బీర్ ఆలీ కాంగ్రెస్ నుంచి బరిలో దిగే వరకు తనకు ఎదురు లేదనుకున్నారు బిగాల గణేష్ గుప్త. బీజేపీ తనకు పోటీ కాదని వారిని లైట్ గా తీసుకోగా బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గణేష్ గుప్తపై అవినీతి, అక్రమాలపై ఆరోపణలు చేసి దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

నిజామాబాద్ నగరంలో 1200 కోట్ల అభివ`ద్ది జరిగితే ఇప్పటి వరకు రోడ్లు, డివైడర్లు మినహా ప్రజలకు ఏమి ఉపయోగపడడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ప్రతిపక్షాల ఆరోపణలు ఖండించడంలో గణేష్ గుప్త చేసిన ఆలస్యం మూల్యం చెల్లించడానికి కారణమైంది. అంతేగాకుండా బీఆర్ఎస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్న నేతలు ఈ ఎన్నికల్లో సహకరించలేదని ఓట్లను అడుగకుండానే సైలెంట్ గా ఉన్నారానేది ఆరోపణలున్నాయి.

Similar News