పిడుగుపాటుకు 8 మూగ జీవాలు మృతి
గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి గొర్రెలు, మేకలమందపై పిడుగు పడగా ఎనిమిది మూగ జీవాలు మరణించాయి.
దిశ, తిరుమలాయపాలెం: గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి గొర్రెలు, మేకలమందపై పిడుగు పడగా ఎనిమిది మూగ జీవాలు మరణించాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా లకారం గ్రామానికి చెందిన లక్ష్మయ్య, పుల్లయ్యలు ఎండాకాలం సమీపించడంతో గొర్రెల, మేకల మేతకోసం ఆప్రాంతంనుంచి,రెండు నెలల క్రితం మండలంలోని ఎర్రగడ్డ ప్రాంతానికి వలస వచ్చారు.
గ్రామ సమీపాన వ్యవసాయ భూమిలో దొడ్డి ఏర్పాటు చేసుకోని సమీప ప్రాంతాలలో జీవాలు మేపుతున్నారు. కాగా గురువారం నుంచి ఉరుములు, మెరుపులతో కురుస్తున్న అకాల వర్షానికి శుక్రవారం తెల్లవారుజామున మేకల మందపై పిడుగు పడింది. ఈ ఘటనలో మూడు గొర్రెలు, మూడు మేకలు, రెండు మేక పిల్లలు మరణించాయి. మరణించిన వాటి విలువ సుమారు రూ.లక్ష ఇరవై వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.