పబ్లిసిటీకి రూ.7.5 వేల కోట్లు..? యాడ్‌ల పేరుతో BRS నిధులు దుబారా!
కేసీఆర్ హయాంలో జరిగిన ప్రకటనల ఖర్చుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ హయాంలో జరిగిన ప్రకటనల ఖర్చుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఐ అండ్ పీఆర్ శాఖపై రివ్యూ చేసే చాన్స్ ఉన్నట్టు అధికార వర్గాల్లో టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి దేశ వ్యాప్తంగా ప్రకటనలు, హోర్డింగ్స్ కోసం అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేసింది.
రూ.7.5 వేల కోట్ల ఖర్చు?
బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం సుమారు రూ.7.5 వేల కోట్లు వరకు ఖర్చు చేసినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది. ఈ ఖర్చు కేవలం పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ నుంచి చేయకుండా ఒక శాఖ ప్రోగ్రాం ప్రకటనలను సంబంధిత శాఖ బడ్జెట్ నుంచి ఖర్చు చేశారు. 2023–24 బడ్జెట్‌లో ఐ అండ్ పీఆర్ కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఈ నిధులతోనే దశాబ్ది వేడుకల సమయంలో దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ చేసినట్టు తెలుస్తున్నది. ప్రకటనలు నేరుగా ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇవ్వకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా విడుదల చేయడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, నాందేడ్ సిటీల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టారు.
డిజిటల్ మీడియా ఖర్చుపై ఆరా
దశాబ్ది వేడుకల సమయంలో ప్రభుత్వ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందులో ప్రధానంగా డిజిటల్ మీడియాకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించనట్టు తెలిసింది. తనకు అత్యంత సన్నిహితుడైన కొణతం దిలీప్‌ను మాజీ మంత్రి కేటీఆర్ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా నియమించారు. ఆయనకే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యతలకు అప్పగించినట్టు టాక్ ఉంది. శాఖపరమైన విచారణ తరువాత ఆయనపై ప్రభుత్వం కేసు నమోదు చేసే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. కాంట్రాక్టు పద్ధతిలో అపాయింట్ అయిన దిలీప్ ప్రభుత్వం మారగానే రాజీనామా చేశారు.