ఆరోగ్య శాఖలో కొత్త అంబులెన్స్​లు

వైద్యారోగ్య శాఖ నూత‌నంగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహ‌నాలు,34 హ‌ర్సె వాహ‌నాల‌ను కొనుగోలు చేసింది.

Update: 2023-07-31 17:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:  వైద్యారోగ్య శాఖ నూత‌నంగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహ‌నాలు,34 హ‌ర్సె వాహ‌నాల‌ను కొనుగోలు చేసింది. వీటిని మంగళవారం హైదరాబాద్ ​నెక్లెస్​ రోడ్డులో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అత్యవసర సేవలకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్‌లు అందుబాటులో ఉండగా, వీటిలో 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్​ చేయనున్నారు. మరో 29 అంబులెన్సులను కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో అంబులెన్స్​ల సంఖ్య 455కు పెరగనున్నది. ఇక గ‌ర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి వాహ‌నాలు (102 వాహనాలు) ప్రస్తుతం 300 ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో 228 వాహ‌నాలకు కాలం చెల్లిపోవ‌డంతో వాటిని తొలిగించి, వాటి స్థానంలో కొత్తవి రిప్లేస్​చేయనున్నారు. ప్రభుత్వ ద‌వాఖాన‌ల్లో మ‌ర‌ణించిన‌వారి పార్థివ దేహాల‌ను స్వస్థలాలకు తరలించేందుకు ప్రస్తుతం 50 హర్ సే వాహనాలు ఉన్నాయి. ఇందులో 34 వాహనాలు పాతవి కావడంతో వాటి స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకురానున్నారు.

వైద్య సేవ‌లు మరింత పటిష్టం: ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖల మంత్రి హ‌రీశ్ రావు

అత్యవసర స‌మ‌యాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హ‌ర్సె వాహ‌నాలు ఎంతో విలువైన సేవ‌లు అందిస్తున్నాయి. అయితే కొన్ని వాహ‌నాల‌కు కాలం చెల్లిపోవ‌డంతో త‌రుచూ మరమ్మత్తులకు గుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పాత వాహ‌నాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.ఈ మేర‌కు 466 నూత‌న వాహ‌నాలు సమకూర్చుకుంటున్నాం. వీటి రాక‌తో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుంది. ప్రమాదంలో ఉన్న వారికి అత్యవసర సేవలు వెంటనే అందుతాయి.’’

Tags:    

Similar News