‘పది’ పరీక్ష పేపర్ లీక్: చంపుతానని బెదిరించి ప్రశ్నాపత్రం లాక్కున్నాడు.. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఐదు సంవత్సరాలు డిబార్ చేయబడిన హరీష్ గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.
దిశ, కమలాపూర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఐదు సంవత్సరాలు డిబార్ చేయబడిన విద్యార్థి గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ నెల 4వ తేదీన మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి హిందీ పరీక్ష రాస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన వద్ద నుంచి హిందీ ప్రశ్నాపత్రాన్ని ఇవ్వమని అడిగాడని, తాను ఇవ్వనని క్లాస్ రూంలో ఉన్న ఇన్విజిలేటర్ కు చెబుతానని తిరస్కరించడంతో ఈ విషయం ఎవరికైనా చెబితే తనను చంపుతానని బెదిరించి వెళ్లిపోయి మళ్లీ తనకు తెలియకుండానే వచ్చి తన వద్ద ఉన్న హిందీ ప్రశ్నాపత్రాన్ని లాక్కొని ఫోన్ లో ఫోటో తీసుకొని మరలా ప్రశ్నాపత్రాన్ని వదిలి వెళ్లాడని ఆరోపించాడు.
జరిగిన సంఘటనతో నాకు ఎటువంటి సంబంధం లేకుండానే చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని, పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు భవిష్యత్ నాశనం చేయొద్దని, తనకు అవకాశం ఇవ్వాలని పత్రికాముఖంగా బాలుడి తల్లి అధికారులను వేడుకుంది.