New Rules: నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం.. అమల్లోకి రానున్న న్యూ రూల్స్ ఇవే!
నూతన ఆర్థిక సంవత్సరం సందర్భంగా ఫైనాన్షియల్‌గా భారీగా మార్పులు చేరుకోబోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నూతన ఆర్థిక సంవత్సరం సందర్భంగా ఫైనాన్షియల్‌గా భారీగా మార్పులు చేరుకోబోతున్నాయి. ఇన్‌కం ట్యాక్స్ నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు స్వల్ప మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల 2025–26 బడ్జెట్‌లో కొత్త ఇన్‌కం టాక్స్ విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేసింద. ఇక రూ.12 లక్షల లోపు ఇన్‌కం ఉన్న వారు ఇక ట్యాక్స్ చెల్లించాల్సి అవసరం లేదు. ఉద్యోగులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇటీవలే కేంద్రం వెసులుబాటు కల్పించింది.
ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు మించితే టీడీఎస్ ఉండేది.. కానీ తాజాగా ఆ పరిమితిని రూ.లక్షకు పెంచారు. ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమీషన్ ఆదాయం ఏటా రూ.15 వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా.. ప్రస్తుతం ఆ లిమిట్ రూ.20 వేలకు పెరిగింది. యాక్టివ్‌గా లేని బ్యాంక్ ఖాతాలకు లింక్ అయిన యూపీఐ ఐడీలు ఇక పని చేయవు. అదేవిధంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల్లో రివార్డ్ పాయింట్లలో కీలక మార్పులు చేసింది. సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డు వినియోగదారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న 10 రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా 5 రెట్లకు తగ్గించారు.