40 వేల మందికి ఏజ్‌బార్.. నేడు నిరుద్యోగుల ప్రగతిభవన్ ముట్టడి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 24.62 లక్షల మంది ఉన్నారు. ఈ మూడేండ్లలో మరో 5 లక్షల మందికిపై ఉంటారని అంచనా. మరోవైపు 2018 నుంచి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఈ జాప్యం నిరుద్యోగుల పాలిట శాపమవుతున్నది. దీంతో లక్షన్నర మంది కొలువుల అర్హతకు దూరమవుతున్నారు. ఇక నిరుద్యోగుల నుంచి దరఖాస్తు ఫీజు రూపంలో వసూలు చేసిన సొమ్ముతో జీతాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 24.62 లక్షల మంది ఉన్నారు. ఈ మూడేండ్లలో మరో 5 లక్షల మందికిపై ఉంటారని అంచనా. మరోవైపు 2018 నుంచి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఈ జాప్యం నిరుద్యోగుల పాలిట శాపమవుతున్నది. దీంతో లక్షన్నర మంది కొలువుల అర్హతకు దూరమవుతున్నారు. ఇక నిరుద్యోగుల నుంచి దరఖాస్తు ఫీజు రూపంలో వసూలు చేసిన సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. టీఎస్పీఎస్సీకి దరఖాస్తులతో రూ. 84 కోట్లు వచ్చాయి.
ఇప్పటికే 40 వేల మందికి నో ఛాన్స్
రాష్ట్రంలో నిరుద్యోగులకు పరిస్థితి ఘోరంగా మారింది. ముందుగా కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, పోస్టుల వర్గీకరణ, ఉప ఎన్నికలు, మండలి, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కారణాలతో మూడున్నరేండ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదు. 2018 నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. గ్రూప్ – 1, గ్రూప్ – 2, గ్రూప్ – 3, గ్రూప్ -4లతో పాటు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు, టీచర్ల ఖాళీల భర్తీకీ ప్రకటనలు రాలేదు. దీంతో గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు దాటిన వారు ఉద్యోగ దరఖాస్తులకు అర్హత కోల్పోతున్నారు. 2018 నాటికి 40 ఏళ్లు దాటిన వారు 40,994 మంది ఉన్నారని టీఎస్‌పీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు నెలల్లో వీరిలో ఎక్కువ మంది అర్హత కోల్పోనున్నారు. ఇక 35 నుంచి 40 ఏళ్ల వయసున్న వారు మొత్తం 1,05,325 మంది ఉన్నారు.
యూనివర్సిటీల్లో కొలువు అంతే
టీఎస్‌పీఎస్సీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 24.62 లక్షల మంది సర్కారు కొలువుల కోసం పోటీపడుతున్నారు. వీరంతా ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. పోలీసుశాఖ, యూనివర్సిటీలలో ఉద్యోగాలు ఆశిస్తున్న వారిలో మరో 60 వేల మంది కనీస వయోపరిమితి కూడా దాటుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డుల ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. వీటిల్లో ఖాళీల భర్తీకి మూడేళ్లుగా ప్రకటన రాకపోవడం గమనార్హం.
త్వరలో అంటూ సాగదీత
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ప్రభావం కాస్త తగ్గింది. 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై జీవో కూడా విడుదలైంది. దీంతో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు చర్యలు మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు. నిజానికి మండలి ఎన్నికలకు ముందు డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటినుంచి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఉద్యోగుల జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా పోస్టుల విభజన ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
లక్ష మందికి నో ఛాన్స్!
ఇక పోలీసు విభాగంలో గరిష్ట వయోపరిమితి కానిస్టేబుల్ పోస్టులకు 22 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 25 ఏళ్లుగా ఉంది. దీంతో ఇప్పటికే 25 ఏళ్లు దాటిన వారికి పోలీసు ఉద్యోగం రావడం కలగానే మిగిలిపోయింది. టీఎస్‌పీఎస్సీ లెక్కల ప్రకారం 2018లో 20 నుంచి 25 ఏండ్లు ఉన్న వారు 8.67 లక్షలుగా నమోదై ఉన్నారు. ఇప్పుడు వీరంతా పోలీస్ ఉద్యోగాల ఆశలు వదిలేసుకున్నట్టే. అదేవిధంగా 35 నుంచి 40 ఏండ్లు ఉన్న వారు 1.05 లక్షల మంది ఉండగా.. వీరు కూడా ఇప్పుడు 40 ఏండ్లు దాటిపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బోర్డుల ఉద్యోగాలకు వీరు అర్హత కోల్పోయినట్టే.
నిరుద్యోగుల నిరసన బాట
రాష్ట్రంలో వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలనే డిమాండ్‌తో విపక్షాలతో కలిసి నిరుద్యోగులు నిరసన బాట పడుతున్నారు. ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఆందోళనలు నిర్వహించారు. తాజాగా జిల్లాల వారీగా జేఏసీలుగా ఏర్పాటై మంగళవారం ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. వీరికి విపక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. దీంతో మంగళవారం జరిగే ప్రగతిభవన్ ముట్టడి ఆసక్తిగా మారింది. కానీ పోలీసులు కూడా జిల్లాల్లో ఇప్పటికే అరెస్ట్‌లు మొదలుపెట్టారు. నిరుద్యోగ జేఏసీ, వారికి మద్దతు ఇచ్చే పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగాలు తక్కువ.. ఫీజులు ఎక్కువ
టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు దరఖాస్తు ఫీజు వసూలు చేస్తుంది. గత ఏడేండ్లలో దరఖాస్తుల ఫీజుల రూపంలో ఏకంగా రూ.84 కోట్ల ఆదాయం వచ్చిందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దరఖాస్తుల రూపంలో వసూలైన రూ.84 కోట్లలో రూ. 72.45 కోట్లను సిబ్బంది జీతాలకు వినియోగించినట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగాలు ఇచ్చేది తక్కువ ఫీజులు వసూలు చేసేది ఎక్కువ అన్నట్లు టీఎస్‌పీఎస్సీ తీరు ఉందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
టీఎస్పీఎస్సీలో నమోదైన నిరుద్యోగుల వివరాలు
వయస్సు పురుషులు స్త్రీలు మొత్తం
20 ఏండ్లలోపు 4,06,731 3,11,433 7,18,164
20=25 5,33,801 3,33,578 8,67,379
25=30 3,02,398 1,94,104 4,96,502
30=35 1,37,729 95,939 2,33,668
35=40 63,277 42,048 1,05,325
40=41 27,725 13,725 40,994
మొత్తం 24,62,032