భిన్న కారణాలతో ముందుకు కదలడం లేదు

దిశ, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో రైల్వే ప్రయాణం తక్కువ. ఏపీలో అన్ని చోట్ల రైల్వే సదుపాయం ఉంది. తెలంగాణలో మాత్రం లేదు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ లీడర్లు రైల్వే ప్రాజెక్టులు, నిధులన్నీ ఏపీకి తరలించారనేది తెలంగాణవాదుల వాదన. ప్రత్యేక తెలంగాణ స్టేట్ వస్తే రైల్వేలైన్లు తెలంగాణకు వస్తాయని ప్రచారం జరిగింది. కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాం. అయినా రాష్ట్రంలో రైల్వేలో పురోగతి కనిపించడం లేదు. అడపాదడపా కేంద్రం ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నా తెలంగాణ సర్కార్ […]

Update: 2020-05-26 00:08 GMT

దిశ, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో రైల్వే ప్రయాణం తక్కువ. ఏపీలో అన్ని చోట్ల రైల్వే సదుపాయం ఉంది. తెలంగాణలో మాత్రం లేదు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ లీడర్లు రైల్వే ప్రాజెక్టులు, నిధులన్నీ ఏపీకి తరలించారనేది తెలంగాణవాదుల వాదన. ప్రత్యేక తెలంగాణ స్టేట్ వస్తే రైల్వేలైన్లు తెలంగాణకు వస్తాయని ప్రచారం జరిగింది. కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నాం. అయినా రాష్ట్రంలో రైల్వేలో పురోగతి కనిపించడం లేదు. అడపాదడపా కేంద్రం ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నా తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు. కేంద్రం డబ్బులిచ్చినా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని మెదక్-అక్కన్నపేట, మనోహరాబాద్-కొత్తపల్లి, ఎంఎంటీఎస్ పేజ్ 2, ఆదిలాబాద్-ఆర్మూర్, భద్రాచలం-సత్తుపల్లి ప్రాజెక్ట్‌ పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో సుమారు 200 రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, రైల్వే అండర్‌ బ్రిడ్జిలు నిధుల్లేక ఆగిపోయాయి. గతంలో రైల్వే ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ, కొంత కాలంగా ప్రజారవాణా దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం చొప్పున కొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. ఇలా భిన్న కారణాలతో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు.

ఎంఎటీఎస్‌ ఫేజ్‌ 2కి రూ.450 కోట్లు రావాలె..
2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.817 కోట్ల అంచనాతో ఎంఎంటీఎస్‌ ఫేజ్‌2 ప్రాజెక్టు మంజూరైంది. జంట నగరాల్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అతి పెద్ద రవాణా వ్యవస్థ ఎంఎంటీఎస్‌ రెండో దశ. గత ఐదున్నర ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్- రాంచంద్రాపురం సెక్షన్‌లో 6 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. 2018లో మార్చి 20 కిలోమీటర్ల దూరం ఉన్న మల్కాజ్‌గిరి-బొల్లారం డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్‌ పనులు పూర్తయ్యాయి. మేడ్చల్‌ బొల్లారం, మౌలాలీ ఘట్‌కేసర్‌ పనులు పూర్తయ్యాయి. ఫలక్‌నుమా ఉమ్దానగర్‌ మధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రైల్వే వారు రూ.663 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.129 కోట్లు మాత్రమే ఇచ్చారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇంకా 450 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. రైలు పెట్టెలు కొనడానికి, ఇతర పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇస్తే తప్ప రైళ్లు నడిపే పరిస్థితి లేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఎంఎంటీఎస్‌2ను రాయగిరి వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అక్కన్నపేట-మెదక్‌..
2012-13లో 17 కిలోమీటర్ల దూరానికి రూ.118 కోట్లతో అక్కన్నపేట-మెదక్‌ కొత్త లైన్‌ మంజూరైంది. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం తెలంగాణ ప్రభుత్వం భరించడంతోపాటు, ఉచితంగా భూమి ఇచ్చింది. 2019 మే 18న అక్కన్నపేట స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా లక్ష్మాపూర్, షమ్నాపూర్, మెదక్‌లో మొత్తం 3 కొత్త రైల్వే స్టేషన్లు, 3 భారీ వంతెనలు, 1 ఆర్వోబీ, 35 మైనర్‌ బ్రిడ్జిలు, 15 ఆర్‌యూబీలు ఉన్నాయి. 2019 ఆగస్టులో అందుబాటులోకి తేవాలని అనుకున్నా, నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాకే తిరిగి పనులు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.105.38 కోట్లు భరించాల్సి ఉండగా రూ.21.15 కోట్లే డిపాజిట్‌ చేసింది. ఇప్పటివరకు అయిన వ్యయం ప్రకారం ఇంకా రూ.50.41 కోట్లు డిపాజిట్‌ చేయాల్సి ఉంది.

భద్రాచలం-సత్తుపల్లి..
2010-11లో రూ.704 కోట్లతో భద్రాచలం-సత్తుపల్లి కొత్త లైను (56.25 కి.మీ.) ప్రాజెక్టు మంజూరైంది. దీన్ని రైల్వే, సింగరేణి కలిసి సంయుక్తంగా చేపడుతున్నాయి. ల్యాండ్‌ మాత్రం రైల్వే ఇవ్వగా, మిగతా పనులన్నీ సింగరేణి చేపట్టాల్సి ఉంది. సర్వే పూర్తయ్యి, భూసేకరణ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఖమ్మం జిల్లాలో 280 ఎకరాలకు 255 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 570 ఎకరాలకు 519 ఎకరాలు అప్పగించారు. ఇతర భూసేకరణ పనులు నడుస్తున్నాయి. రూ.619 కోట్లు సింగరేణి భరించాల్సి ఉంది. కానీ, కేవలం రూ.356.38 కోట్లు మాత్రమే చెల్లించింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.952 కోట్లకు పెంచారు. అన్ని రకాల ధరలు పెరగడంతో ప్రాజెక్టు ఖర్చు పెరిగినట్లు తెలిసింది.

మనోహరాబాద్‌-కొత్తపల్లి..
2016-17లో మనోహరాబాద్‌-కొత్తపల్లి ప్రాజెక్టు (150కి.మీ.) రూ.1,160 కోట్ల అంచనాతో మంజూరైంది. ప్రాజెక్ట్‌ వ్యయంలో 1/3 ఖర్చు, ల్యాండ్‌ ఇవ్వాలి. మొత్తం 151.40 కి.మీ. ప్రాజెక్టును 4 దశల్లో అమలు చేస్తున్నారు. 90 శాతం ల్యాండ్‌ అప్పగించగా, మిగతాది కూడా ఇవ్వాల్సి ఉంది. 2019 మార్చికే పూర్తి కావాల్సి ఉన్నా ల్యాండ్‌ సేకరణ, జాతీయ రహదారిపై మళ్లింపు, మిషన్‌ భగీరథ డైవర్షన్‌తో ముందుకు అడుగు పడలేదు. 2020 జనవరిలో ప్రారంభించాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ లైను నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.307 కోట్లు భరించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.60 కోట్లే డిపాజిట్‌ చేసింది. ఇప్పటి దాకా చేసిన ఖర్చు ప్రకారం ఇంకా రూ.71.61 కోట్లు తమకు డిపాజిట్‌ చేయాల్సి ఉంది.

ఆదిలాబాద్‌-ఆర్మూర్‌..
2008-09లో ఆదిలాబాద్‌ ఆర్మూర్‌ కొత్త లైన్‌ (136 కి.మీ.) సర్వే మంజూరైంది. రూ.697.97 కోట్ల వ్యయం అవుతుందని 2010లో రైల్వే బోర్డుకు నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2014-15లో కొత్త సర్వే చేశారు. తర్వాత పటాన్‌చెరు నుంచి నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌ వరకు రివైజ్డ్‌ సర్వే చేశారు. రూ.4,109.32 కోట్ల వ్యయం అవుతుందని రిపోర్టు ఇచ్చారు. అయితే, ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ లైన్‌కు సంబంధించిన ఫైల్‌ కేసీఆర్‌ వద్ద ఆగింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే పనులు పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణ దూరం తగ్గనుంది.

ఆర్వోబీ, ఆర్‌యూబీల పెండింగ్‌..
రాష్ట్రంలో సుమారు 200 ఆర్వోబీ, ఆర్‌యూబీ ప్రాజెక్ట్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ శాతం కేంద్రం, రాష్ట్రం 50 శాతం చొప్పున భరించనున్నాయి. మరికొన్ని మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కానీ, నిధులు లేకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. 200 ప్రాజెక్ట్‌ల్లో 50 అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఆర్వోబీలు, ఆర్‌యూబీలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణ సమయంలో రైళ్లు వెళ్లే దాకా ఎదురుచూడాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News