మేడారం జాతరలో ‘అమేజింగ్ టెక్నాలజీ’
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఉపయోగించిన టెక్నాలజీ సక్సెస్ అయ్యింది. డీజీపీ మహేందర్ రెడ్డి సూచనతో 6నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించిన ఐటీ వింగ్ జాతరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి శభాష్ అనిపించుకుంది. దాదాపు 15 సీసీ కెమెరాలను భక్తులు ప్రవేశించే మార్గాల్లో ఏర్పాటు చేసిన పోలీసులకు.. ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంటుందనేది వెంటనే తెలిసిపోయింది. ఎప్పటికప్పుడు […]
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఉపయోగించిన టెక్నాలజీ సక్సెస్ అయ్యింది. డీజీపీ మహేందర్ రెడ్డి సూచనతో 6నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించిన ఐటీ వింగ్ జాతరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి శభాష్ అనిపించుకుంది. దాదాపు 15 సీసీ కెమెరాలను భక్తులు ప్రవేశించే మార్గాల్లో ఏర్పాటు చేసిన పోలీసులకు.. ఎక్కడెక్కడ క్రౌడ్ ఉంటుందనేది వెంటనే తెలిసిపోయింది. ఎప్పటికప్పుడు వెంటనే అదుపు చేసేందుకు కంట్రోల్ రూం నుంచి సూచనలు అందడంతో ఆ దిశగా పోలీసులు ప్రయత్నం చేసి విజయం సాధించారు. ప్రయాగ కుంభమేళాలో భక్తుల నియంత్రణకు యూజ్ చేసిన ఏఐ టెక్నాలజీ అధ్యయనంతో మేడారంలో అనుసంధానం చేసి సక్సెస్ అయ్యారు.
దాదాపు నెలరోజులుగా జాతర నడుస్తున్నా అమ్మవార్లు గద్దెను చేరుకొని వనప్రవేశం చేసిన నాలుగు రోజులే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. ఇలాంటి సమయంలో శాంతిభద్రతలు పోలీసులకు పెద్ద సవాల్. అయితే టెక్నాలజీతో పాటు సిబ్బందిని లెక్కప్రకారం రంగంలోకి దింపిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ మొత్తం విజయవంతం అయ్యింది. సాధారణ భక్తులు కోటి మందికి పైగా రావడంతో పాటు కేంద్రమంత్రులు, గవర్నర్లు, సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా సునాయసంగా దర్శనం కలిగేలా పోలీస్ వ్యవస్థ పక్కా స్కెచ్‌తో ముందుకు పోయింది. క్యూలైన్ల పక్కన నిలబడి ఎవరికి ఏ చిన్న ఇబ్బంది రాకుండా పకడ్బందీ వ్యూహాలు రచించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి జాతర సందర్భంగా రెండు రోజులు వచ్చి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి వెళ్లారు. కిందిస్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చి వెళ్లారు. దాదాపు 10వేలమంది పోలీసులు జాతరలో విధులు నిర్వహించి భక్తులకు ఇబ్బందులు రాకుండా చూసినా.. జంపన్నవాగు వద్ద ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. స్నానం చేసే సమయంలో ఫిట్స్ రావడంతో ఖమ్మం జిల్లాకు చెందిన భక్తుడితో పాటు, సికింద్రాబాద్ వాసి చనిపోయారు. జాతర చివరి రోజున శనివారం నాడు జంపన్న వాగు సమీపంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ భక్తురాలికి తెగిపోయిన విద్యుత్ తీగ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. బంధువులు ఆందోళన చేసినా అధికారులు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చి భక్తులు ఇబ్బందులు పడినా భద్రతా విషయంలో ఎలాంటి ఢోకా లేకుండా చూసుకొని పోలీసులు సక్సెస్ అయ్యారు.