మన నిర్లక్ష్యానికి… 20 కోట్ల మందిని బలి పెడదామా?

దిశ వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. రోజురోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూ మనుషుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంటుంది. అగ్రదేశాలు, ఆరోగ్యానికి పెద్ద పీట వేసే దేశాలు కూడా.. కరోనా మహమ్మారికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించినందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మేల్కొని తమ దేశ ప్రజలను కాపాడుకోవడానికి ఎక్కడిక్కడ నియంత్రణ చర్యలు చేపడుతున్న.. కట్టడి చేయలేక పోతున్నారు. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లోని పరిస్థితే ఇందుకు ఉదాహరణ. అలాంటిది.. […]

Update: 2020-03-25 04:39 GMT

దిశ వెబ్ డెస్క్: కరోనా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. రోజురోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూ మనుషుల ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంటుంది. అగ్రదేశాలు, ఆరోగ్యానికి పెద్ద పీట వేసే దేశాలు కూడా.. కరోనా మహమ్మారికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించినందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నాయి. ఇప్పుడు మేల్కొని తమ దేశ ప్రజలను కాపాడుకోవడానికి ఎక్కడిక్కడ నియంత్రణ చర్యలు చేపడుతున్న.. కట్టడి చేయలేక పోతున్నారు. ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లోని పరిస్థితే ఇందుకు ఉదాహరణ. అలాంటిది.. మన దేశంలో.. ముఖ్యంగా మన రాష్ర్టంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. రాష్ట్రమంతా లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలను ఇంటికి పరిమితం కావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అయినా.. మన ప్రజలు మనకు రావడం లేదని, బయట తిరిగితే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నారు. కరోనా ఏ ఒక్కరికో ప్రమాదం కాదు… ఆ ఒక్కరితో తమ కుటుంబానికి, ఈ సమాజానికి మన దేశానికే ప్రమాదం.

పక్క రాష్ట్రాల్లో వరదలు వస్తే, భూకంపాలు సంభవిస్తే.. విరాళాలు ఇచ్చాం. పక్క గ్రామానికి విపత్తు వస్తే.. మన వంతు సాయం అందిస్తాం. మన పక్క వాళ్లో లేదా మన కాలనీ వాళ్లకో.. అత్యవసర పరిస్థితి వస్తే.. ముందుండి వారిని ఆదుకుంటాం. అలాంటింది దేశం మొత్తం విపత్తు లో ఉన్న వేళ .. ఎందుకింత నిర్లక్ష్య ధోరణి. అలా ఎప్పుడు అందరికీ ఆదర్శంగా, స్పూర్తిగా ఉండే మనలో.. ఆనాటి స్ఫూర్తి ఏదీ.. మనమంతా చదువుకున్న వాళ్లం… సాంకేతికత తెలిసిన వాళ్లం.. అర్థం చేసుకోగలం. కానీ, ప్రపంచ పోరాటాన్ని తలపిస్తున్న కరోనా యుద్ధంలో మాత్రం మాకెందుకులే అన్నట్లు ప్రవర్తిస్తున్నాం. మన ఆస్తుల్ని ఇవ్వమని ఎవరు అడగడం లేదు. విరాళాలు అందించమని ఎవరు పిలుపునివ్వడం లేదు. బార్డర్ కు వెళ్లి శత్రువులతో పోరాడమని ఆదేశాలు ఇవ్వడం లేదు. కేవలం మన ఇల్లు దాటి బయటకు రావద్దని మాత్రమే చెబుతోంది ప్రభుత్వం. అది కూడా మన ప్రాణాలు కాపాడుకోవడానికే చెబుతోంది. మన నుంచి సమాజానికి ముప్పురాకుండా

ఇళ్లకు పరిమితం కావాలని కోరుతోంది. అంతే.. మనం అది కూడా చేయలేమా..? ఎవరి నెల వేతనాలు ఆగకుండా కూడా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.. మనం బాధ్యతగా ఆ మాత్రం సహకరించలేమా అయినా మనం వినిపించుకోవడం లేదు. ఏదో ఓ సాకుతో ఇల్లు వీడటానికి ప్రయత్నిస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వానికి, తోటి ప్రజలకు సహకరిద్దాం.

అతిక్రమిస్తే.. ఏమవుతుంది?

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి కరోనా సోకిన వ్యక్తులు సమూహాలతో కలిసి తిరిగితే.. కొత్తగా ఆ వ్యాధి సోకిన వారు లక్షణాలు బయటపడక ముందే దానిని మరికొందరికి అంటిస్తే అదుపు చేయడం కష్టమైపోతుంది. దానిని అడ్డుకోలేము. మన దేశ జనాభా 130 కోట్లు.. మన జనాభాకు సరిపడా డాక్టర్లు లేరు. ఆసుపత్రులు లేవు. అందరికీ కావాల్సిన వైద్య పరికరాలు లేవు. వెంటిలేటర్లు లేవు. కరోనా టెస్ట్ చేయడానికి కిట్లు కూడా అందరికీ సరిపోవు. అగ్రరాజ్యమైన అమెరికాలోనే వైద్య సామాగ్రి నిండుకుందంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యున్నత వైద్యవ్యవస్థ ఉన్న ఇటలీలో లాక్‌డౌన్‌ను ప్రజలు ఇలానే నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. అక్కడి వైద్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. మరోపక్క స్పెయిన్‌లో వైరస్ బారిన పడ్డ వృద్ధులను రిటైర్‌మెంట్ హోమ్‌లలో పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో వారున్న పడకలపైనే జీవచ్ఛవాలుగా మిగిలిపోయారు. మరికొంతమంది ఎప్పుడు చనిపోయారో కూడా తెలియని దయనీయ పరిస్థితి. దీంతో అక్కడ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఈ దుస్థితికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. ఒక్కసారి పరిస్థితి చేయదాటిపోతే..ఎలా ఉంటుందో అనడానికి ఆ రెండు దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మరణాలే నిలువెత్తు నిదర్శనాలు. అదే మనదేశమైతే.. ఇంకెలా ఉంటుందో.. ఊహించుకుంటేనే ఒళ్లు వణికిపోతోంది. మన ఒక్కరి నిర్లక్ష్యం వల్ల 20 కోట్ల మంది బలి అయ్యే అవకాశం ఉంది. ఇది కాకి లెక్క కాదు సీడీడీఈపీ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణ స్వయంగా వెల్లడించాడు.

ఆ కథలానే:

ఒక రాజు.. తమ రాజ్యంలోని ప్రజలందరినీ ఒక చెంబు నిండా పాలు తెచ్చి ఒక పెద్ద కుండలో పోయమన్నాడు. అందరూ పాలు తెస్తారు కదా.. నేనొక్కడినే నీల్లు తీసుకుపోతే ఏమవుతుందిలే అందులో కలిసిపోతాయి కధా అనుకున్నారు. అలా ప్రజలంతా నీళ్లనే తీసుకు వచ్చారు. అలానే ఇక్కడ కూడా అంతే.. నేను బాగానే ఉన్నాను కదా.. నేను ఒక్కడినే బయట తిరిగితే ఏమవుతుందిలే అనుకుంటే.. ఇటలీ, అమెరికా, స్సెయిన్ లామూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకే ప్రభుత్వాలు అటువంటి పరిస్థితి తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా లాక్‌డౌన్‌లు ప్రకటిస్తే నిత్యావసరాల పేరుతో.. కాలక్షేపం పేరుతో రోడ్లపైకి గుంపులుగా చేరి వ్యాధి వ్యాప్తికి కారకులమై మన ముప్పును మనమే చేజేతులారా కొనితెచ్చుకొంటున్నాం.

కరోనా అనుమానం వస్తే ఎలా ఉండాలో తెలుసా?

క్వారంటైన్‌ చేయాలంటే అనుమానితుడు వృద్ధులు, పిల్లలకు దూరంగా ఉండాలి. వారికి దుస్తులు, గిన్నెలు వేరుగా ఉంచాలి.. వేరుగా శుభ్రం చేయాలి. మరుగుదొడ్లు కూడా వేరుగా ఉండాలి. మన దేశంలో ఎంతో మందికి ఇల్లు లేవు. ఉన్నా ఒక్క రూములోనే అందరూ సర్దుకుంటారు. అలాంటప్పుడు వైరస్ సోకితే ఎలా ఆపగలుగుతాం. ఎలా మన కుటీంబీకులకు, కాలనీవాళ్లకు రాకుండా ఎలా కట్టడి చేస్తావు? సాధ్యమేనా? అందుకే అప్రమత్తమే ముఖ్యం. ఇంట్లోనే ఉంటే.. అంత దాకా తెచ్చుకోం కదా. చైనాలో మొదట వచ్చినప్పుడు మరణమృదంగా మోగింది. కానీ ఇప్పుడు చాలా వరకు అక్కడ కొత్త కేసులు నమోదు కావడం లేదు. ఎందుకంటే..చైనా కూడా తమ ప్రజలను అష్ట దిబ్భందనం చేసింది. ఈ దిగ్బంధ వ్యూహంతో చైనా ఈ వైరస్‌ను ఒకరి నుంచి సమూహం మొత్తానికి వ్యాపించడాన్ని సమర్థంగా నివారించింది. అప్పుడు ఆ వ్యాధి సదరు వ్యక్తికి లేదా.. ఆ ఇంటికి మాత్రమే పరిమితం అవుతుంది. వారిని గుర్తించి చికిత్సను అందిస్తే అంతటితో పరిస్థితి అదుపులోకి వస్తుంది.

దీనిని అడ్డుకోవడం కోసం సామాజిక దూరాన్ని పాటించడం, ఇంటికే పరిమితమై ఉండటం చాలా ముఖ్యం.. మనం కేవలం కొన్ని రోజులు ఇళ్లల్లో ఉండి.. మన ప్రాణాలను.. సమాజాన్ని కాపాడలేమా. దేశంలోని 32 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అంటే దీనర్థం వారికి నిత్యావసర వస్తువులు కూడా అందకుండా చేయడమని కాదు. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. పరిస్థితి చేయదాటి పోకుండా చూసుకోవడమే ప్రభుత్వ విధి. మనందరి విధి .అందుకే ప్రభుత్వం చెప్పిందనే కాదు..మనకు మనంగా స్వచ్ఛందంగా క్వారంటైన్ అవుదాం. మన కుటుంబాన్ని,సమాజాన్ని దేశాన్ని కరోనా నుంచి కాపాడుకుందాం. కరోనా విముక్త భారతే మన నినాదం కావాలి. దీనికి మన ఇల్లే వేదిక కావాలి.

Tags:    

Similar News