కరోనా విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీరోజు విడుదల చేసే బులిటెన్‌లో హైకోర్టు ప్రశంసించిందంటూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఈ నెల 1వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలేదని, ఇదే చివరి అవకాశంగా భావించాలని, ఇకనైనా అమలుచేయకపోతే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోర్టుల సహనాన్ని పరీక్షించేలా వ్యవహరించవద్దని ఘాటుగానే వ్యాఖ్యానించింది. ర్యాపిడ్ టెస్టులు ఎక్కడ, ఎన్ని […]

Update: 2020-07-20 05:07 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీరోజు విడుదల చేసే బులిటెన్‌లో హైకోర్టు ప్రశంసించిందంటూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఈ నెల 1వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలేదని, ఇదే చివరి అవకాశంగా భావించాలని, ఇకనైనా అమలుచేయకపోతే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోర్టుల సహనాన్ని పరీక్షించేలా వ్యవహరించవద్దని ఘాటుగానే వ్యాఖ్యానించింది. ర్యాపిడ్ టెస్టులు ఎక్కడ, ఎన్ని చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ప్రతీరోజూ బలిటెన్‌లో జిల్లాలవారీగా కేసుల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. కరోనా విషయంలో ప్రజాస్వామిక వేదిక, ‘తెలంగాణ ఇంటి పార్టీ’ తదితర పిటిషన్లతో పాటు మిగిలినవాటిని కూడా కలిపి సోమవారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పై విధంగా స్పందించింది.

సుమారు ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వ వ్యవహారశైలిని డివిజన్ బెంచ్ తప్పుపట్టింది. ఈ నెల 1వ తేదీన ప్రభుత్వం అమలుచేయాల్సిన అంశాలను ఇదే న్యాయస్థానం స్పష్టం చేసిందని, కానీ అమలుకావడంలేదని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. ఆ అధికారులకపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసేలా ఆదేశాలు ఎందుకు జారీ చేయకూడదో కూడా వివరించాలని ప్రవ్నించింది. పదేపదే ఆదేశిస్తున్నా ఒక్కటి కూడా అమలుచేయకపోవడానికి కారణమేంటని నిలదీసింది.

ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యం?

ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని వ్యాఖ్యానించింది. ఒకవైపు కేసులు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. ప్రజారోగ్య విభాగం ప్రతీరోజు విడుదల చేసే బులెటిన్లలో ఇప్పటికీ సమగ్ర వివరాలు ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రుల వారీగా బెడ్‌లు, వెంటిలేటర్ల వివరాలు ఇవ్వాలని చెప్పినా అవి ప్రతిబింబించడంలేదని వ్యాఖ్యానించింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని నొక్కిచెప్పింది.

ఇదే చివరి అవకాశం

బులిటెన్‌లో హైకోర్టు అభినందించిందంటూ పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అభినందించిందంటూ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మందలించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఘాటుగానే వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు ఇకపైన అమలు కాకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని అడ్వొకేట్ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణకు ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్ హాజరు కావాలని ఆదేశించింది.

ర్యాపిడ్ టెస్టులు ఎక్కడ ఎన్ని?

బులెటిన్లలో వివరాలు ఇప్పటికీ సమగ్రంగా ఉండడంలేదని వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్ కలెక్టర్లు జిల్లాల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని స్పష్టం చేసింది. పాజిటివ్ పేషెంట్లకు ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న వ్యక్తులకు జరిపిన పరీక్షల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. వైద్యారోగ్య శాఖ వెబ్‌సైట్‌ను వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ఆసుపత్రులవారీగా అందుబాటులో ఉన్న బెడ్‌ల వివరాలతో పాటు రాపిడ్ టెస్టులను ఎక్కడ ఎన్ని చేస్తున్నారనే వివరాలను కూడా బులిటెన్లలో వెల్లడించాలని ఆదేశించింది.

కంప్లయింట్ సెల్ ఏర్పాటుచేయాలి

కరోనా విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఫోన్ చేసి తెలియజేయడానికి మరిన్ని ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తేవాలని డివిజన్ బెంచ్ సూచించింది. ఇప్పటికే నెలకొల్పిన వాట్సాప్ నంబరును విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని పేర్కొంది. కరోనా నియంత్రణ ప్రభుత్వం, దానికింద పనిచేసే అధికారుల రాజ్యాంగబద్ధమైన విధి అని వ్యాఖ్యానించి అలాంటి బాధ్యతలను విస్మరించరాదని స్పష్టం చేసింది. వివాహాలు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలని సూచించింది.

Tags:    

Similar News