సడలింపా? పొడిగింపా? నేడు తేల్చనున్న సీఎం!

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ శనివారంతో ముగియనుంది. ఇప్పుడున్న సడలింపును యధాతథంగా కొనసాగించడమా లేక పొడిగించడమా అనేదానిపై మంత్రివర్గం అత్యవసరంగా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ అంశంతో పాటు వ్యవసాయం, వానాకాలం సాగు, రుతుపవనాల ప్రభావం, సీజనల్ వ్యాధులు, గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోయడం తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నది. కేబినెట్ భేటీకి ముందు […]

Update: 2021-06-18 13:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ శనివారంతో ముగియనుంది. ఇప్పుడున్న సడలింపును యధాతథంగా కొనసాగించడమా లేక పొడిగించడమా అనేదానిపై మంత్రివర్గం అత్యవసరంగా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ అంశంతో పాటు వ్యవసాయం, వానాకాలం సాగు, రుతుపవనాల ప్రభావం, సీజనల్ వ్యాధులు, గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోయడం తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నది.

కేబినెట్ భేటీకి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో ప్రగతి భవన్‌లో శుక్రవారం సాయంత్రం సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రైతుబంధు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సీఎంకు వివరించారు. వైద్యారోగ్య శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే భేటీ అయిన మంత్రి హరీశ్‌రావు లాక్‌డౌన్‌పై వారితో జరిపిన చర్చల సారాంశాన్ని, ఆ శాఖ అధికారుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను కేసీఆర్‌కు తెలియజేశారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నందున దాన్ని రాత్రి తొమ్మిది గంటల వరకు పొడిగించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నందున కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఆంక్షల కారణంగా కరోనా అదుపులోకి వచ్చిందని సీఎం, మంత్రులు, అధికారులు భావిస్తున్నందున మరో పది రోజుల పాటు ఇలాగే కొనసాగించడం ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

ఆంక్షలను సడలించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని డెల్టా ప్లస్ వేరియంట్, నెల రోజుల్లోపు థర్డ్ వేవ్ ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినందువల్ల తెలంగాణతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగే ఆస్కారం ఉన్నది. సెకండ్ వేవ్ ఉధృతి మహారాష్ట్ర కారణంగానే వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ భావిస్తున్నందున ఈసారి థర్డ్ వేవ్‌కు అలాంటి అవకాశం ఇవ్వరాదనేదే ప్రభుత్వ అభిప్రాయం. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సడలింపులు ఉన్నందున తెలంగాణలో సైతం అదే తరహా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

వ్యవసాయం, రైతుబంధు సాయం పంపిణీ, వానాకాలం సాగు తదితరాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నది.

Tags:    

Similar News