'కరోనా' జనాబ్… క్యా హై జవాబ్!

దిశ, న్యూస్‌బ్యూరో: “శకునాలు చెప్పే బల్లి కుడితల పడ్డదట”. తెలంగాణ ప్రభుత్వం తీరు కూడా అట్లనే ఉంది. కరోనాపైన కేంద్రాన్ని అప్రమత్తం చేసి తాను మాత్రం అలసత్వానికి జవసత్వమిచ్చింది! మర్కజ్ మ్యాటర్ ముందే తెలిసినా.. ముందుజాగ్రత్త చర్యల్లో వెనుకబడింది!! కళ్లుగప్పి కరోనా కరీంనగర్ కు వచ్చిందని పసిగట్టినా.. రాష్ట్రమంతటికీ పాకుతుంటే కళ్లప్పగించి చూసింది! మర్కజ్ ప్రార్థనల్లో వెయ్యిమందికిపైగా రాష్ట్రవాసులు పాల్గొన్నారని తెలిసినా.. వారిలోని 160 మంది ఆచూకీని కనిపెట్టలేకపోయింది!! అన్ని తెలుసు.. మొత్తం సమాచారముంది.. ఢిల్లీలో ఉన్న […]

Update: 2020-04-02 10:10 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: “శకునాలు చెప్పే బల్లి కుడితల పడ్డదట”. తెలంగాణ ప్రభుత్వం తీరు కూడా అట్లనే ఉంది. కరోనాపైన కేంద్రాన్ని అప్రమత్తం చేసి తాను మాత్రం అలసత్వానికి జవసత్వమిచ్చింది! మర్కజ్ మ్యాటర్ ముందే తెలిసినా.. ముందుజాగ్రత్త చర్యల్లో వెనుకబడింది!! కళ్లుగప్పి కరోనా కరీంనగర్ కు వచ్చిందని పసిగట్టినా.. రాష్ట్రమంతటికీ పాకుతుంటే కళ్లప్పగించి చూసింది! మర్కజ్ ప్రార్థనల్లో వెయ్యిమందికిపైగా రాష్ట్రవాసులు పాల్గొన్నారని తెలిసినా.. వారిలోని 160 మంది ఆచూకీని కనిపెట్టలేకపోయింది!!

అన్ని తెలుసు.. మొత్తం సమాచారముంది.. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సైతం ఢిల్లీలో జరిగిన దాని గురించి వాళ్లే ముందు చెప్పారు.. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ప్రమాదం ముంచుకొస్తుంటే చూస్తూ కూర్చున్నారు…అదిప్పుడు నియంత్రించలేని స్థితిలోకి వెళ్లిందా అనే అనుమానాలు వాళ్లకే వస్తున్నాయి. ఈ మాటలన్నీ కరోనాను యమ స్పీడుగా దేశం, రాష్ట్రంలో వ్యాప్తి చేసిన ఢిల్లీ మర్కజ్ మసీదు ప్రార్థనలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు సంబంధించినవి.. మర్కజ్ మసీదులో ప్రార్థనలు చేసి కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని తామే ముందు కేంద్ర ప్రభుత్వానికి తెలిపినట్టు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ బుధవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అన్నీ తెలిసిన ప్రభుత్వం ఇంత పెద్ద మహమ్మారి రాష్ట్రంలో మర్కజ్ యాత్రికుల వల్ల వ్యాప్తి చెందుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరించిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్ మసీదులో సమావేశాలకు హాజరైన 1030 మందిలో, 160 మంది వివరాలను అధికారులు ఇప్పటికీ కనుక్కోలేకపోయారంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్పష్టమవుతోంది. అక్కడికి వెళ్లొచ్చినవారిలో ఇప్పటికే 30 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. వీళ్ల నుంచి వాళ్ల కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. వీళ్లింకా ఎవరెవరిని కలిశారన్నదానిపై ఆరాతీసే పనిలో అధికారులు ఇప్పటికి పడ్డారు. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చి పది రోజులు దాటింది. ఈ పది రోజుల్లో వీరు ఎంతమందిని కలిశారన్నది జవాబు దొరుకుతుందో లేదో తెలియని భయంకర ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు జవాబు దొరకాలంటే అనుమానమున్న ప్రతి ఏరియాలో ర్యాండమ్ టెస్టులు చేయాలని అధికారులు అంటున్నారు.

మార్చి 14 నుంచి 17 మధ్యాహ్నం వరకూ మర్కజ్‌ మసీదు సమావేశాల్లో 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. 17 నుంచి 21 వరకు వీరంతా ఢిల్లీ నుంచి పలు రైళ్లలో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే నార్త్‌ ఇండియాలోని పలు రాష్ర్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో అక్కడి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆయా రాష్ర్టాల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రాలకు రావడం ప్రారంభించారు. లాక్‌డౌన్ వార్తలు అప్పటికే వస్తున్న నేపథ్యంలో ఏ రైలు దొరికితే అది ఎక్కి వారంతా వచ్చేశారు. దీంతో 18 నుంచి 21వ తేదీ వరకూ ఢిల్లీ నుంచి రైళ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా వచ్చాయి. ఇవే రైళ్లలో కరోనా వైరస్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ప్రయాణించారు. అప్పటికే వారికి వైరస్ లక్షణాలు స్టార్టయ్యాయి. ఈ నెల 26న తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 18న రైలు దిగే టైముకే కుత్బుల్లాపూర్‌‌కు చెందిన పేషెంట్‌కు కరోనా లక్షణాలున్నట్టు ట్రావెల్‌ హిస్టరీలో పొందుపర్చారు. ఇలా చాలా మంది ఢిల్లీలోనే వైరస్ బారిన పడి రాష్ట్రానికి వచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోవాలంటే దాదాపు 24 గంటలు పడుతుంది. ఈ లాంగ్ జర్నీలో కరోనా ఉన్న వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. పేషెంట్లు ప్రయాణించిన బోగీల్లో ఎంతమంది ఉన్నారు.. వాళ్ల వివరాలేంటో తెలుసుకోవడానికి హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు రైల్వే అధికారుల సాయం తీసుకుంటోంది. కొంచెం కష్టమైనప్పటికీ రిజర్వేషన్‌పై ప్రయాణించినవాళ్లను పట్టుకోవచ్చుగానీ, జనరల్ టికెట్‌పై ప్రయాణించిన వాళ్లను పట్టుకోవడం అయ్యే పనికాదని అధికారులు చెబుతున్నారు.

మర్కజ్ సమావేశాల్లో పాల్గొని రాష్ర్టానికి చేరుకున్న తర్వాత వైరస్ లక్షణాలున్నప్పటికీ, చాలా మంది దానిని కరోనాగా భావించలేదు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే ప్రైవేటు ప్రైవేటు ఆస్పత్రులకు, ఆర్‌‌ఎంపీల వద్దకు వెళ్లారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖను మాత్రం సంప్రదించలేదు. దీంతో పరిస్థితి విషమించి ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్లొన్నవారిలో ఆరుగురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి వారు వచ్చి టెస్టులు చేయించుకోవాలని తాజాగా ప్రభుత్వమిచ్చిన పిలుపుతో పది రోజుల తర్వాత మంగళ, బుధవారాల్లో వారంతా గాంధీ హాస్పిటల్‌కు క్యూ కట్టారు. ఇందులో 15 మందికి కరోనా ఉన్నట్టు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం మరికొంతమందికి పాజిటివ్ వచ్చింది. ఈ పది రోజుల్లో కుటుంబ సభ్యులతో పాటు, బయటి వాళ్లను కూడా వీరు కలిశారు. ఉద్యోగాలకు, వ్యాపార పనులకు హాజరయ్యారు. దీంతో పాజిటివ్ వచ్చిన వాళ్లు ఎవరెవరిని కలిశారో గుర్తించడం అధికారులకు ప్రస్తుతం తలనొప్పిగా మారింది.

మర్కజ్ విషయంలో ఇప్పటికే లేటయినందున ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేస్తే తప్ప వ్యాధి స్ర్పెడ్ కాలేదని చెప్పలేమని డాక్టర్లు అభిప్రాయ పడుతున్నారు. రాష్ర్టంలో, తొలుత విదేశాల నుంచి వచ్చినవాళ్లలో వైరస్ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే టెస్టులు చేయించారు. వారిలో పాజిటివ్ వచ్చిన పేషెంట్ల కాంటాక్ట్‌ పర్సన్స్‌కు టెస్టులు చేశారు. ఫారిన్ రిటర్నీస్‌లో సుమారు 17 వేల మందికి మైల్డ్‌ సింప్టమ్స్ ఉన్నాయని ప్రకటించినప్పటికీ, వాళ్లెవరికీ ఇప్పటికీ టెస్టులు చేయలేదు. దీన్ని బట్టి ఎలా చూసినా రాష్ట్రంలో కరోనా కేసులుండొచ్చని అనుమానమున్న ప్రతి ప్లేస్‌లో ర్యాండమ్ సాంపుల్ టెస్టులే గతి అన్న వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News