వాళ్లు మళ్లీ తిరిగొస్తామంటున్నారు: సోమేష్
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల్లో చాలా మంది త్వరలో తిరిగి తెలంగాణకు రావడానికి సుముఖంగా ఉన్నట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1.22 లక్షల వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి స్వరాష్ట్రాలకు తరలించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన వలస కార్మికులందరినీ వారి స్వరాష్ట్రాలకు పంపించడం శనివారంతో పూర్తయిందన్నారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికుల్లో చాలా మంది త్వరలో తిరిగి తెలంగాణకు రావడానికి సుముఖంగా ఉన్నట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1.22 లక్షల వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి స్వరాష్ట్రాలకు తరలించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన వలస కార్మికులందరినీ వారి స్వరాష్ట్రాలకు పంపించడం శనివారంతో పూర్తయిందన్నారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన వలస కార్మికుల ప్రత్యేక రైలుకు సీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి 6 రైళ్లు శనివారం ప్రారంభమై వివిధ ప్రాంతాలకు బయలుదేరాయని, రాష్ట్రంలోని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి మరో 40 రైళ్లు వలస కార్మికులను తీసుకొని ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయని చెప్పారు. ఈ రైళ్ల ద్వారా దాదాపు 50 వేల వలస కార్మికులను వివిధ ప్రాంతాలకు చేర్చనున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు రైల్వే శాఖ ఆహారాన్ని అందిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికునికి రెండు ఆహార పొట్లాలు, 3 లీటర్ల తాగు నీరు, పండ్లను అందిస్తోందన్నారు. వలస కార్మికులను పంపించే కార్యక్రమాలను సమర్ధవంతంగా సమన్వయంతో మానిటరింగ్ చేస్తున్నందుకు పోలీస్, ఇతర శాఖల అధికారులను సీఎస్ అభినందించారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్ నిర్మాణంలో వలస కార్మికులు ఒక భాగం అన్నారు. ఆపదలో ఉన్న వలస కార్మికులందరిని సురక్షితంగా వారి సొంత పట్టణాలకు పంపించడం తనకు సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఆదనపు డీ.జీ(లా అండ్ ఆర్డర్) జితేందర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ , జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ , రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, రంగారెడ్డి జిల్లా జాయిట్ కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.