కాంగ్రెస్ నేతల గుండెల్లో రెబల్ గుబులు
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల గుండెల్లో రె’బెల్’ మోగుతోంది. అధికార పార్టీ పై గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మార్చుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందాలని ఆశీస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు నెలకొంటున్నాయి. దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ మంత్రి చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో […]
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల గుండెల్లో రె’బెల్’ మోగుతోంది. అధికార పార్టీ పై గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మార్చుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందాలని ఆశీస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు నెలకొంటున్నాయి.
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ మంత్రి చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న హర్షవర్ధన్ రెడ్డి ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ వచ్చారు. పార్టీలో చేరే సమయంలోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని ఒప్పందంతోనే చేరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో మంచి గుర్తింపును సాధించడంతో తప్పనిసరిగా తనకు టికెట్ లభిస్తుందని హర్షవర్ధన్ ఆశించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో హర్షవర్ధన్ రెడ్డితోపాటు ఆయన అనుచర వర్గం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా అయినా రంగంలోకి దిగాలనే తపనతో ముందడుగు వేస్తున్నారు.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వచ్చే అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు కావడంతో రెండు మూడు ప్రచార కార్యక్రమాలు పెద్దగా నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. దీంతో కాంగ్రెస్ లోని ఒక వర్గం చిన్నారెడ్డి కన్నా హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతుంటే.. మరో వర్గం మాత్రం నిరాడంబరుడైనా చిన్నారెడ్డి సరైన అభ్యర్థి అని చెబుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచన చేసి తనకు టికెట్ కేటాయించాలని హర్షవర్ధన్ రెడ్డి పట్టు పడుతుండడంతో, విషయాన్ని చిన్నారెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రెబెల్స్ లేకుండా చూస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు కూడా. కానీ, హర్షవర్ధన్ రెడ్డి అనుచర వర్గం అతడిని తప్పనిసరిగా పోటీలో ఉండాలని ఒత్తిడి చేస్తోంది.
సంప్రదింపులు…
పార్టీ అధిష్టానం పిలుపుమేరకు హర్షవర్ధన్ రెడ్డి సోమవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో సమావేశమయ్యారు. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుని చిన్నారెడ్డి కి మద్దతు ఇవ్వాలని, 2023లో వచ్చే టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ఆలోచించుకొని చెబుతానని హర్షవర్ధన్ రెడ్డి వెనుతిరిగినట్లు సమాచారం.
అనుచర వర్గం ఒత్తిడి..
ఎన్నికల్లో హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేయవలసిందేనని ఆయన అనుచర వర్గం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వర్ధన్ రెడ్డి అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి పోటీలో ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.