రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి‌భవన్‌లో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సచివాలయ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో జరిగే వ్యవసాయం, కరోనా, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నెల 1వ తేదీన ఒక ప్రకటనలో వివరించింది. ఆ ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొన్ని అంశాలు టేబుల్ ఎజెండాగా […]

Update: 2020-08-04 10:50 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి‌భవన్‌లో బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సచివాలయ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో జరిగే వ్యవసాయం, కరోనా, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నెల 1వ తేదీన ఒక ప్రకటనలో వివరించింది. ఆ ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొన్ని అంశాలు టేబుల్ ఎజెండాగా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ సమావేశంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. పదోన్నతుల అవకాశాన్ని కోల్పోతున్నామని ఉద్యోగులు, కొత్త కొలువులు వచ్చే అవకాశం నీరుగారుతోందని నిరుద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండడంతో ప్రభుత్వం ఆచితూచి అడుగేయాలని నిర్ణయించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలు ఉన్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేసి పరిష్కారం కనుగొనేందుకు ఆగస్టు 5వ తేదీన సమావేశం తేదీని ఖరారు చేసింది. కానీ ముందస్తుగా నిర్ణయమైన కార్యక్రమాలు ఉన్నాయనే పేరుతో సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి హాజరుకాలేమంటూ నిస్సహాయతను వ్యక్తం చేశారు. సరిగ్గా అదే రోజున మంత్రివర్గ సమావేశాన్ని ఖరారు చేసి అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఈ కారణం చేతనే హాజరుకాలేకపోయామనే సంకేతాన్ని ఇవ్వడానికి వీలు కలిగింది.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యా సంవత్సరం, సిలబస్, ప్రవేశ పరీక్షలు.. ఇలాంటి అనేక అంశాలపై స్పష్టత లేనందువల్ల క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతూ జిల్లాల నుంచి గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నందున కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News