వ్యూహం ఖరారు చేస్తారా? నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్నది. ఇందులో చర్చించాల్సిన ఎజెండా అంశాలు దాదాపుగా ఖరారయ్యాయి. పోడు భూములు, ధరణి పోర్టల్, యాసంగిలో వరి సాగు, కొనుగోళ్ళు, ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, విద్యుత్ టారిఫ్‌ను పెంచడం, కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరు, రాష్ట్ర హక్కులను సాధించుకోడానికి అవలంబించాల్సిన వైఖరి తదితరాల పలు అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్నది. ఇందులో చర్చించాల్సిన ఎజెండా అంశాలు దాదాపుగా ఖరారయ్యాయి. పోడు భూములు, ధరణి పోర్టల్, యాసంగిలో వరి సాగు, కొనుగోళ్ళు, ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, విద్యుత్ టారిఫ్‌ను పెంచడం, కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరు, రాష్ట్ర హక్కులను సాధించుకోడానికి అవలంబించాల్సిన వైఖరి తదితరాల పలు అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రివర్గ సమావేశానికి అవసమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని సీఎం ఇప్పటికే ఆదేశించారు. సమావేశంలో చర్చించే అంశాలకు అనుగుణంగా ఆయా శాఖలకు చెందిన అధికారులు కూడా ప్రగతి భవన్ చేరుకోనున్నారు.
ఒమిక్రాన్ కట్టడిపై చర్చ
పలు దేశాల్లో విస్తరిస్తున్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం, తీసుకోవాల్సిన చర్యలు, కట్టడి కోసం రూపొందించాల్సిన వ్యూహం తదితరాలపై కేబినెట్ భేటీలో చర్చ జరగనున్నది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ఈ విషయమై వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల హెడ్‌లతో సమీక్ష నిర్వహించారు. వర్క్ డివిజన్‌తో పాటు సమన్వయం గురించి సూచనలు చేశారు. విమానాశ్రయం దగ్గర స్క్రీనింగ్ చర్యలతో పాటు నివారణ చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు కొత్త వేరియంట్ రాకుండా ఉండేలా అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేయడం, జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ కు పంపడం లాంటి అన్ని చర్యలూ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి.
వరి సాగు, కొనుగోళ్ళపై స్పెషల్ డిస్కషన్
ప్రస్తుతం వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ళతో పాటు రానున్న యాసంగి సీజన్‌లో వరి సాగును ఆపివేయడం, దానికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల్ని మళ్ళించడం తదితరాల గురించి మంత్రివర్గ సమావేశం చర్చించనున్నది. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో పచ్చి బియ్యాన్ని విక్రయించడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వరి సాగు వద్దని రైతులకు పిలుపునిచ్చింది. ఏ ప్రత్యామ్నాయ పంటను ఎన్ని ఎకరాల్లో పండించాలో తాజా పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రం సాగు ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. దీనిపై కేబినెట్ చర్చించి స్పష్టత ఇవ్వనున్నది.
పోడు భూములు, ధరణిపైనా రివ్యూ
పోడు సేద్యంపై ఆధారపడి బతుకుతున్న ఆదివాసీ రైతులకు పట్టాలు ఇవ్వడం, ఇప్పటివరకు తీసుకున్న దరఖాస్తులు, లీగల్ చిక్కులు, ఎప్పటిలోగా పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలి తదితరాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక ధరణి వెబ్ పోర్టల్ నిర్వహణలో తలెత్తిన సమస్యలు, వాటి పరిష్కారం, రైతులు ఎదుర్కొ,టున్న ఇబ్బందులను అధిగమించడానికి చేయాల్సిన మార్పులు చేర్పులు తదితరాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. ఈ రెండు అంశాలకు సంబంధించి గత మంత్రివర్గ సమావేశాల్లోనే చర్చించి కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. అవి నివేదికలను కూడా సమర్పించాయి. వీటిపై సోమవారం జరిగే సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇక ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం తదితరాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.