సర్కార్‌కు ‘ఆసరా’ టెన్షన్.. పక్కదారి పడుతున్న పింఛన్లు.?

దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లలు విదేశాల్లో ఉన్నా.. బహుళ జాతి కంపెనీల్లో పని చేస్తున్నా.. అమెరికాలో గ్రీన్​కార్డు పొంది రూ.లక్షలు సంపాదిస్తున్నా.. వారికీ రేషన్​కార్డు, పింఛన్ కావాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు. కొడుకులు, కోడళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండగా వారి తల్లిదండ్రులు కూడా రేషన్​కార్డు పొందిన వారూ ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులు ఆసరా పింఛను పొందటానికి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. తక్కువ ఆదాయాన్ని పేర్కొంటూ, తప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలను పింఛన్ల […]

Update: 2021-09-06 23:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లలు విదేశాల్లో ఉన్నా.. బహుళ జాతి కంపెనీల్లో పని చేస్తున్నా.. అమెరికాలో గ్రీన్​కార్డు పొంది రూ.లక్షలు సంపాదిస్తున్నా.. వారికీ రేషన్​కార్డు, పింఛన్ కావాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు. కొడుకులు, కోడళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండగా వారి తల్లిదండ్రులు కూడా రేషన్​కార్డు పొందిన వారూ ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులు ఆసరా పింఛను పొందటానికి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

తక్కువ ఆదాయాన్ని పేర్కొంటూ, తప్పుడు ఆదాయ ధృవీకరణ పత్రాలను పింఛన్ల దరఖాస్తులకు జత చేస్తున్నారు. ప్రభుత్వం అర్హతలపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో వయసు పైబడిన వారందరూ అర్హులేనన్న అభిప్రాయం నెలకొంది. అటు రేషన్​కార్డులు, ఇటు పింఛన్ల పథకంలో అనర్హులు, అవసరం లేని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఇలాంటి వారిని గుర్తించి రేషన్ కార్డులు రద్దు చేసి వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ సాయం మొత్తాన్ని తిరిగి వసూలు చేయాల్సి ఉందని చట్టాలు చెబుతున్నాయి. మరో వైపు పింఛన్ అర్హత వయసు 57 ఏండ్లకు కుదించడంతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్లల్లో వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారని మీ సేవా కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు.

కోట్లకు పడగలెత్తిన వారి కుటుంబాల నుంచి కూడా దరఖాస్తులు సమర్పించేందుకు క్యూలో నిలుచుంటున్నారని రంగారెడ్డి జిల్లాలోని ఓ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి దరఖాస్తులతో అర్హులకు అందకుండాపోయే ప్రమాదం నెలకొందన్నారు. రెవెన్యుశాఖలో వీఆర్వోలు, గిర్దావర్లు, సివిల్ సప్లయిస్ శాఖలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. అలాగే అలాంటి ఉద్యోగుల్ని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపించింది. దీంతో అర్హులకు చేరాల్సిన చౌక ధరల ఉత్పత్తులూ అనర్హులకు చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అనర్హులే ముందు వరుస..

గ్రామాల్లో కుటుంబ సభ్యుల పేరిట పదుల ఎకరాల పట్టా భూములున్నాయి. పట్టణ ప్రాంతాల్లో విలువైన ఖాళీ స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు కలిగి ఉండి, పెద్ద ఎత్తున అద్దెల రూపంలో ఆదాయం పొందుతున్న వారు కూడా నేటికీ రేషన్ కార్డుల ద్వారా సరుకులను అందుకుంటున్నారు.

తాజాగా ఆసరా పింఛన్లకి అర్హత వయసు 57 ఏళ్ళకి సడలించడంతో వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారని వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు వారి తల్లిదండ్రులకు రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రస్తుతం పింఛను పొందే అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించడంతో ఆసరా పింఛన్ల కింద దరఖాస్తు చేస్తున్నారు. అమెరికా, ఇతర దేశాల నుంచి వారి పిల్లలు ప్రతి నెలా రూ.వేలల్లో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.

అక్కడి నుంచి పంపిన డబ్బుతో ఎకరాల కొద్దీ భూములు, నగరాల్లో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేస్తున్నారు. ఆ ఆస్తుల నుంచి ఆదాయం సమకూరుతోంది. కానీ ఆసరా పింఛన్ తమకెందుకు రాదంటూ దరఖాస్తులు సమర్పిస్తుండడం వల్ల అర్హుల జాబితా చిన్నబోతోందని రెవెన్యూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్​వేర్ ఇంజినీర్లుగా పని చేస్తోన్న వారు వారి తల్లిదండ్రులను నిలువరించే ప్రయత్నం చేయడం లేదని విమర్శిస్తున్నారు.

కళ్ల ముందు వారికి ప్రతి నెలా రూ.వేలల్లో ఆదాయం వస్తున్నట్లు ఆస్తులే చెబుతున్నాయి. కానీ దరఖాస్తుల పరిశీలనలో మాత్రం నిజానిజాలు వెలుగులోకి రావడం లేదు. ప్రభుత్వం తరపున కూడా సంపన్న, ఉద్యోగ వర్గాల కుటుంబాలకు ఆంక్షలు విధిస్తే తప్ప అనర్హుల జాబితాను ఏరేయడం కష్టమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

విదేశీ ప్రయాణానికేమో..

– సంపన్న వర్గాలు ఓ వైపు ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక సాయం కోసం రేషన్ కార్డు జతపరుస్తున్నారు. వారే మరో వైపు వారి పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లడానికి బ్యాంక్ పూచీకత్తులు అవసరమైనప్పుడు మాత్రం రూ.లక్షల విలువైన వ్యవసాయ ఆదాయం ధ్రువీకరణ (అగ్రికల్చర్ ఇన్​కం సర్టిఫికెట్) పొందుతున్నారు.

– పిల్లలు విదేశాల్లో బహుళ జాతి కంపెనీల్లో పని చేస్తున్నారు. కొందరు ఏకంగా గ్రీన్ కార్డు పొంది రూ.లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వారి తల్లిదండ్రులకు రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకొందరు పింఛన్లు పొందుతున్నారు.

– వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, కస్తూర్బా పాఠశాలల్లో టీచర్లు, డీఆర్డీఏ టెక్నికల్ ఆసిస్టెంట్లు, మహిళ స్వయం సహాయక సంఘాల్లో సీఏలు, పోలీస్ శాఖ ఉద్యోగులు, వైద్య, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వార్షికాదాయం రూ.1.5 లక్షల కంటే ఎక్కువగా ఉంది. వీరిలో చాలా మందికి ఇప్పటికీ రేషన్ కార్డులు ఉన్నాయి. తాజాగా వారి తల్లిదండ్రులు ఆసరా పింఛన్ పొందటానికి ప్రయత్నిస్తున్నారు.

– ఐసీడీఎస్ శాఖలో అంగన్వాడీ టీచర్లు పెరిగిన వేతనాల ప్రకారం వార్షికాదాయం రూ.1.5 లక్షలు దాటినా, ఇప్పటికే ఆ కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా, వారి భర్తలు మరోసారి ఆసరా పింఛన్లు పొందటానికి దరఖాస్తు చేస్తున్నారు.

– గ్రామం, పట్టణం అన్న తేడాలేమీ లేవు. పదెకరాలకు పైగా భూమి కలిగిన వారు కూడా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు మీ సేవా కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు.

 

Tags:    

Similar News