పాముకాటుకు కొత్తమందు కొనుగొన్న పరిశోధకులు

ప్రపంచంలో ఏటా పాము కాటుకు లక్షన్నర మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక వెల్లడిస్తోంది.

Update: 2024-10-23 15:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలో ఏటా పాము కాటుకు లక్షన్నర మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక వెల్లడిస్తోంది. పాము కాటుకి గురైనపుడు దాని కోరలు దిగిన చోట, ఆ చుట్టుపక్కల కణజాలం నశించిపోవడంతో ఆ అవయవాలు పనిచేయక, అంగ వైకల్యం ఏర్పడుతుంది. ఇలా అంగవైకల్యం పొందిన వారి సంఖ్య కూడా 4 లక్షల దాకా ఉంటుందని సంస్థ తెలుపుతోంది. ఇప్పటివరకు ఉన్న పాముకాటు మందులు ఎటూ సరిపోవడం లేదు. ఎన్నో రకాల రోగాలకు, దెబ్బలకు కొత్త కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాముకాటుతో పొందే అంగవైకల్యాన్ని నయం చేయడానికి ఎలాంటి మందులు ఇంతవరకు కనుగొనలేదు. దీనికి ఓ పరిష్కార మార్గాన్ని యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సాధారణంగా ఉపయోగించే రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్‌ను నాగుపాము విషానికి చవకైన విరుగుడుగా పునర్నిర్మించవచ్చు.

గుండెపోటు వచ్చినప్పుడు 24 గంటల్లోపల ఇచ్చే హెపారిన్(Heparin) మందు కణజాలం క్షీణతని సమర్థంగా అడ్డుకుంటుందని కనిపెట్టారు. హెపారిన్ రక్తం గడ్డకట్టకుండా, కణజాలం దెబ్బతినకుండా కాపాడే మందు. పాము కాటుకి గురైన వెంటనే దీన్ని ఇస్తే కణజాలం క్షీణతను, దాంతో పాటు వచ్చే అంగ వైకల్యాన్ని నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పాము కాటు గాయం అయిన చోట త్వరగా హెపారిన్ని ఇంజెక్ట్ చేయగలిగితే 90 శాతం వైకల్యాన్ని నివారించొచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. పాము కాటు నుండి మనిషి ప్రాణాలను రక్షించడానికి 'యాంటీ వెనమ్'(Anti Venom) ను సకాలంలో ఇవ్వాల్సి ఉంటుంది.


Similar News