‘గూగుల్ సెర్చ్‌లో క్వాలిటీ లేని సమాధానాలు’
ప్రస్తుతం దేని గురించిన సమాచారం కావాలన్నా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
దిశ, టెక్నాలజీ: ప్రస్తుతం దేని గురించిన సమాచారం కావాలన్నా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. దీనికోసం చాలా రకాల ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సెర్చింజన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చే సమాధానాల్లో ఖచ్చితత్వం, క్వాలిటీ కనిపించడం లేదని వాటిలో చాలా వాటికి సరైన ఆధారాలు లేవని ఒక పరిశోధన నివేదిక పేర్కొంది.
లీప్‌జిగ్ విశ్వవిద్యాలయం, బౌహాస్-యూనివర్శిటీ వీమర్, సెంటర్ ఫర్ స్కేలబుల్ డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే సెర్చింజన్ ప్లాట్‌ఫారమ్‌లలో మొదటి స్థానంలో ఉన్నటువంటి గూగుల్‌లో కూడా సమాధానాల్లో నాణ్యత, ఖచ్చితత్వం ఉండటం లేదని తెలిపింది. దీంతో పాటు Bing, DuckDuckGo వంటి సెర్చింజన్‌లను కూడా పరిశోధన చేయగా వాటిలో కూడా సరైన ఆధారాలు లేని సమాధానాలు వస్తున్నట్లు కనుగొన్నారు. పరిశోధకులు ఒక ఏడాది పాటు వివిధ సెర్చింజన్ సైట్లను విశ్లేషించగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అదే విధంగా సెర్చింజన్ సైట్లలో వివిధ కంపెనీలు తమ ప్రొడక్ట్‌ల అమ్మకాలను పెంచుకోడానికి అనుబంధ లింక్‌లను యాడ్ చేస్తున్నాయి. అయితే వీటిలో కూడా సరైన ఆధారం లేనివి ఉంటున్నాయి. ఈ లింక్‌లపై క్లిక్ చేయమని పలు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇస్తామని కొన్ని అవసరం లేని వాటిని అందిస్తూ సైట్ ట్రాఫిక్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయని నివేదిక తెలిపింది. దాదాపు 7000 కంటే ఎక్కువ ప్రొడక్ట్‌లకు సంబంధించిన అంశాలను పరిశీలించగా ఈ వివరాలను కనుగొన్నారు.
సెర్చింజన్‌లో అగ్రస్థానంలో ఉన్నటువంటి Google ద్వారా క్వాలిటీ లేని కంటెంట్ ఎక్కువగా వస్తుంది. మిగతా సెర్చింజన్‌లలో కూడా సరైన సమాధానాలు రానప్పటికి ఈ విషయంలో వాటి కంటే కొంత మెరుగ్గా గూగుల్ ఖచ్చితత్వం కలిగిన సమాధానాలు అందిస్తుందని నివేదిక పేర్కొనడం గమనార్హం.