ఎన్నికల గురించి నాకు ఏం తెలియదంటున్న గూగుల్ జెమిని చాట్‌బాట్
ఈ ఏడాది భారత్‌తో పాటు పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా గూగుల్ తన జెమిని AI చాట్‌బాట్‌ను పరిమితం చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
దిశ, టెక్నాలజీ: ఈ ఏడాది భారత్‌తో పాటు పలు దేశాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా గూగుల్ తన జెమిని AI చాట్‌బాట్‌ను పరిమితం చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల AI చాట్‌బాట్‌లో వస్తున్న సమాధానాలు వివాదాస్పదం అవుతున్నాయి. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇలాంటి సమయంలో చాట్‌బాట్ ద్వారా ఎన్నికల గురించి ఎలాంటి సమాధానాలు రాకుండా ఉండటానికి ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను పాజ్ చేసినట్లు గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.
ఇటీవల, మోడీ ప్రభుత్వ విధానాలపై చాట్‌బాట్ వివాదాస్పద సమాధానం ఇవ్వడంతో గూగుల్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దాంతో కంపెనీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అలాగే, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వాయిస్ ఇవ్వడానికి AI ఉపయోగించగా, స్లోవేకియా వంటి ఇతర ప్రదేశాలలో, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఫేక్ ఆడియో రికార్డింగ్‌లు పెద్ద వివాదానికి దారితీశాయి. ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా కట్టడి చేయడంతో పాటు జెమిని AI చాట్‌బాట్ ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నకు అయినా సమాధానం రాకుండా ఉండటానికి కొత్త పరిమితులు తెచ్చినట్లు అధికారులు తెలిపారు.