5జీ వచ్చినా ఫలితం శూన్యం.. చుక్కలు చూపిస్తున్న సెల్ సిగ్నల్

టెక్నాలజీ పెరుగుతున్నది. 2జీ నుంచి 5జీకి వచ్చేశాం.. అయినా అనేక ప్రాంతాల్లో నేటికీ సెల్ సిగ్నల్స్ అందడం లేదు.

Update: 2022-10-09 03:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టెక్నాలజీ పెరుగుతున్నది. 2జీ నుంచి 5జీకి వచ్చేశాం.. అయినా అనేక ప్రాంతాల్లో నేటికీ సెల్ సిగ్నల్స్ అందడం లేదు. కాల్ డ్రాప్, కాల్ జంప్, కాల్ కట్ లాంటి ప్రాబ్లమ్స్‌ను యూజర్స్ ఎదుర్కొంటున్నారు. కొన్ని పల్లెల్లో అసలు ఇంటర్ నెట్ సౌకర్యమే లేదు. సిగ్నల్స్ కోసం మిద్దెలు, చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది. సిగ్నల్స్ 5జీకి కన్వర్ట్ అవుతున్న తరుణంలోనూ ఇంకా ఇలాంటి సమస్యలు ఉండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

టవర్స్ తగ్గాయి.. యూజర్లు పెరిగారు

నెట్‌తో పాటు కాల్ కట్ సమస్యకు ప్రధాన కారణం వినియోగం మేర టవర్స్ లేకపోవడమేనని తెలుస్తున్నది. కొన్ని టవర్లు పాతవి కావడం, మెయింట్‌నెన్స్‌ గురించి పట్టించుకోక పోవడంతో అవి ఆశించిన మేర సిగ్నల్స్ అందించడం లేదు. మరో వైపు టవర్స్ లేకపోవడం, కొత్తవి నిర్మించకపోవడం, యూజర్స్ పెరగడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

కంపెనీల ఆఫర్లు... పెరిగిన సిగ్నల్ ట్రాఫిక్

కంపెనీల ఆఫర్లతో బహిరంగ మార్కెట్‌లో సిమ్‌ల విక్రయాలు పెరిగి సిగ్నల్ ట్రాఫిక్ ఎక్కువైంది. దీంతో కాల్ డ్రాప్, జంప్‌కు ప్రధాన కారణమని సైబర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. వాస్తవానికి కస్టమర్లు పెరుగుతున్న క్రమంలో కంపెనీలు టవర్ల సంఖ్య, సిగ్నల్ ఫ్రీక్వెన్సీని పెంచాల్సి ఉన్నది. కానీ ఈ చర్యలు తీసుకోక పోవడంతో రోజురోజుకూ ఈ ప్రాబ్లమ్ జఠిలమవుతున్నది.

ఏఆర్‌పీయూ ఉన్నా.. మెయింటెనెన్స్ చేయట్లే

కాల్ డ్రాప్, కాల్ జంప్, కట్ అవ్వడం లాంటి సమస్యను కంపెనీలకు గతంలో ఏఆర్‌పీయూ (ఏవరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) చార్జిలు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ మేరకు 2016కు ముందు నెలకు రూ.300గా ఉన్న ఏఆర్‌పీయూ చార్జి రూ.100కు పడిపోయింది. సబ్ స్ర్కైబర్స్ బేస్ పెరగడంతో ప్రస్తుతం రూ.170 నుంచి రూ.200 వరకు వస్తున్నది. అయినా సిగ్నల్‌ను అందించడానికి కంపెనీలు చర్యలు తీసుకోవడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య తీవ్రమవుతున్నది.

5జీతో కొంత మేలు

5జీ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఇంకా ఏడాది పడుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 4జీ లో ఉన్న సమస్యలు 5జీ రాకతో కొంత మెరుగు పడతాయని నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో కాంక్రీట్ బిల్డింగుల నిర్మాణం, ఖాళీ స్థలం లేకుండా భవనాలు నిర్మిస్తుండటంతో సిగ్నల్ సమస్య వస్తున్నదని వారు చెబుతున్నారు.

విస్తరణకు పెట్టుబడి పెట్టట్లే

నెట్‌‌వర్క్ కంపెనీలు వినియోగదారులకు అవసరమైన సిగ్నల్స్ ఇచ్చే అంశంపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా నెట్‌వర్క్ సమస్య వస్తున్నది. కంపెనీలకు ఏఆర్‌పీయూ పెరుగుతున్నా.. విస్తరణకు పెట్టుబడులు పెట్టడం లేదు. మరోవైపు స్పెక్ట్రమ్ వేలం, ఖర్చు నేపథ్యంలో కంపెనీలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. కాంక్రీట్ బిల్డింగులు మధ్యలో గ్యాప్ లేకుండా నిర్మించడంతోనూ సిగ్నల్ సమస్య వస్తున్నది.

నల్లమోతు శ్రీధర్, సైబర్ ఎక్స్‌పర్ట్

Tags:    

Similar News