కూల్చారు..అంతలోనే !

– టపటపా రాలిన టాపార్డర్ (90/6) అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో విఫలమైన భారత్.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా తడబడింది. ఆతిథ్య న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. 36 ఓవర్లలోనే భారత ప్రధాన బ్యాట్స్‌మన్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. కాగా రెండు రోజు ఆట మొత్తం బౌలర్ల హవానే నడిచింది. ఇరు జట్లవీ […]

Update: 2020-03-01 03:21 GMT

– టపటపా రాలిన టాపార్డర్ (90/6)

అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో విఫలమైన భారత్.. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా తడబడింది. ఆతిథ్య న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. 36 ఓవర్లలోనే భారత ప్రధాన బ్యాట్స్‌మన్ పెవిలియన్ బాటపట్టారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. కాగా రెండు రోజు ఆట మొత్తం బౌలర్ల హవానే నడిచింది. ఇరు జట్లవీ కలిపి ఒకే రోజు 16 వికెట్లు పడటం గమనార్హం.

63/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టును భారత పేస్ దళం కుప్పకూల్చింది. ఓపెనర్ టామ్ బ్లండెల్(30) ఉమేష్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 25.3 బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కేవలం 3 పరుగులే చేసి బూమ్రా బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓపెనర్ లాథమ్ (52)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసిన రాస్ టేలర్ (15) జడేజా వేసిన బంతిని ఆడబోయి యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి టేలర్ ఔటయ్యాడు. ఆ తర్వాత లాథమ్ (52), హెన్రీ (14), వాట్లింగ్ (0), సౌథీ (0) ఔటవడంతో కివీస్ కష్టాల్లో పడింది. గ్రాండ్ హోమ్ (26) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు.

తోకను కత్తిరించడంలో పాట్లు..

ప్రధాన బ్యాట్స్‌మన్‌ను చకచకా అవుట్ చేసినా.. టెయిలెండర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్ల లోపాలు ఈ ఇన్నింగ్స్‌లోనూ కొనసాగాయి. ఈ క్రమంలో జేమిసన్ (49), వాగ్నర్ (21) తొమ్మిదో వికెట్‌కు 56 పరుగులు జోడించి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వరుస ఓవర్లలో అవుట్ చేసిన మహ్మద్ షమీ ‘టెయిల్’ కథ ముగించాడు. దీంతో కివీస్ జట్టు 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా భారత జట్టుకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.

మారని కోహ్లీ బ్యాటింగ్..

రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్ ఐదో బంతికి బౌల్ట్ కివీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (3)ను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చి న్యూజిలాండ్ శిబిరంలో ఆనందం నింపాడు. మెదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న మరో ఓపెనర్ పృథ్వీ షా (14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 9వ ఓవర్ తొలి బంతికి సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ మరోసారి తన ఫ్లాప్ షో చూపించాడు. 30 బంతుల్లో 14 పరుగులు చేసి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. వైస్ కెప్టెన్ రహానే కూడా 9 పరుగులు చేసి అవుటవడంతో.. నైట్ వాచ్‌మన్‌గా ఉమేష్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే చివర్లో బౌల్ట్ బౌలింగ్‌లో పుజారా (24), ఉమేష్ (1) బౌల్డ్ అవడంతో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విహారి (5), పంత్ (1) క్రీజ్‌లో ఉన్నారు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండగా..మూడోరోజు భారత్ సాధించే పరుగులపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Tags:    

Similar News