సిండికేటు.. ఎర్రజొన్నకేదీ రేటు?

దిశ, నిజామాబాద్: జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్‌గా మారారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు మిగుల్చుకునేందుకు దందా మొదలుపెట్టారు. రైతుల నుంచి ఎర్రజొన్నను క్వింటాల్‌కు రూ.3,000 వరకే చెల్లించి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో కనీస మద్దతుధర రాక రైతులు కుదులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఫిబ్రవరి చివరి వరకు వ్యాపారులు రూ.2,700కే ఎర్రజొన్నను కొనడంతో రైతులు ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. ఈ క్రమంలోనే రైతుల వ్యూహాన్ని పసిగట్టిన వ్యాపారులు మళ్లీ […]

Update: 2020-03-11 03:02 GMT

దిశ, నిజామాబాద్: జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్‌గా మారారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు మిగుల్చుకునేందుకు దందా మొదలుపెట్టారు. రైతుల నుంచి ఎర్రజొన్నను క్వింటాల్‌కు రూ.3,000 వరకే చెల్లించి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో కనీస మద్దతుధర రాక రైతులు కుదులయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఫిబ్రవరి చివరి వరకు వ్యాపారులు రూ.2,700కే ఎర్రజొన్నను కొనడంతో రైతులు ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. ఈ క్రమంలోనే రైతుల వ్యూహాన్ని పసిగట్టిన వ్యాపారులు మళ్లీ రూ.3,000 వరకు కొనేందుకు రెడీ అయ్యారు.

బహిరంగ మార్కెట్లో ఎర్రజొన్న క్వింటాల్‌కు రూ.3,000 నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది. కానీ, సిండికేట్ వ్యాపారులు దందా మొదలు పెట్టి రూ.3 వేలకు కొంటామని డైరెక్ట్‌గా రైతుల వద్దకే వెళ్తున్నారు. దీనికి ఓ ప్రజాప్రతినిధి సన్నిహితుడు నాయకత్వం వహిస్తూ రూట్‌మ్యాప్ గీస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే పాత ఎర్రజొన్న‌ను కోల్డ్‌స్టోరేజ్ నుండి తీసి క్వింటాల్‌కు రూ.3,500 నుంచి 4,500 ధరకు అమ్ముకుంటున్న పరిస్థితులు సైతం నెలకొంటున్నాయి. ఈ ఆర్మూర్ ఎర్రజొన్న సిండికేట్ వ్యాపారులకు అధికార పార్టీ నేత అండదండలున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

2017లో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ అయి కేవలం రూ.2 వేలకే క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిసి, ప్రభుత్వం ఎర్రజొన్నను క్వింటాల్‌కు రూ.2,800 చెల్లించి తీసుకుంది. మళ్లీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పరిస్థితులు కనపడలేదు. ఒక్క ఆర్మూర్ సబ్‌డివిజన్ పరిధిలోనే ఎర్రజొన్నలను సుమారు 20 వేల నుంచి 22 వేల మంది రైతులు 48 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. రబీ పంటగా పండించే ఎర్రజొన్న పంట పశుగ్రాసంగా కూడా ఉపయోగిస్తారు. వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసి ఢిల్లీ వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎర్రజొన్న రైతులకు రావాల్సిన బకాయిలు రూ.11 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. తర్వాత ప్రతి ఎన్నికల్లో పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ఇస్తామని హమీలు ఇస్తున్నా అమలు చేయట్లేదు. ఈ క్రమంలోనే పంట పెట్టుబడికి అప్పులు చేసిన రైతులను అవకాశంగా మలుచుకుంటున్న వ్యాపారులు సిండికేట్‌గా మారి దందాలు చేస్తున్నారు. మొత్తానికి ఎర్రజొన్నను కొనుగోలు చేసే వ్యాపారులు తమకు నచ్చినట్టు ధరలను నిర్ణయిస్తుండటంతో రైతులకు మద్దతు ధర రాక ఇంకా కుదేలు అవుతున్నారు.

Tags :Nizamabad, Errajonna, Merchants Syndicate, Turmeric, Delhi, Price of support

Tags:    

Similar News