స్వామి వర్సెస్ శ్రీనివాస్… ఉద్యోగులు ఎటువైపు?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన ఉద్యోగుల ఓట్ల కోసం ఇద్దరు నేతలు తలపడుతున్నారు. మొన్నటి వరకు కొంత నిర్లక్ష్యం చేసిన బీజేపీ… ఇప్పుడు మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ను రంగంలోకి దింపింది. ఉద్యోగుల ఓట్లే కీలకంగా ఆయనను ప్రచార బరిలోకి దింపారు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలను సైతం పిలిపించుకుని స్వామిగౌడ్ మంతనాలు జరుపుతున్నారు. బీజేపీ నుంచి స్వామిగౌడ్.. టీఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన ఉద్యోగుల ఓట్ల కోసం ఇద్దరు నేతలు తలపడుతున్నారు. మొన్నటి వరకు కొంత నిర్లక్ష్యం చేసిన బీజేపీ… ఇప్పుడు మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్‌ను రంగంలోకి దింపింది. ఉద్యోగుల ఓట్లే కీలకంగా ఆయనను ప్రచార బరిలోకి దింపారు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలను సైతం పిలిపించుకుని స్వామిగౌడ్ మంతనాలు జరుపుతున్నారు.
బీజేపీ నుంచి స్వామిగౌడ్.. టీఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్
మరోవైపు అధికార టీఆర్‌ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఉద్యోగుల ఓట్లను సాధించే బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయన ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నారు. దీంతో బీజేపీ నుంచి స్వామిగౌడ్.. టీఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్గౌడ్ప్రస్తుతం ఉద్యోగుల ఓట్లను తమ పార్టీలకు తెప్పించేందుకు పోటీ పడుతున్నారు. వాస్తవంగా మొన్నటిదాకా వీరిద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. రాజకీయంగా కొంత దూరం ఉన్నా… ఇద్దరూ ఉద్యోగ సంఘాల నేతలే. టీఆర్‌ఎస్ మంత్రులంతా ఓట్ల కోసం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగుల కోసం బీజేపీ స్వామిగౌడ్‌ను ప్రచారానికి తీసుకువచ్చింది.
ఉద్యోగ సంఘాల్లో స్వామిగౌడ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగ సంఘాలన్నీ వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో టీఎన్జీఓ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న స్వామిగౌడ్.. తెలంగాణ ఉద్యమంలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు ఉద్యమానికి దూరంగా ఉన్న టీఎన్జీఓలు ఆయన వల్ల ఉద్యమ జెండా అందుకున్నారు. టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్… తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో 2009లో స్వామిగౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఎన్జీఓలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. అప్పుడే కేసీఆర్‌కు, స్వామిగౌడ్‌కు మధ్య సాన్నిహిత్యాన్ని ఏర్పడింది. అనంతరం తెలంగాణ తొలి ప్రభుత్వంలో స్వామిగౌడ్‌కు మండలి ఛైర్మన్‌గా కేసీఆర్ అవకాశం కల్పించారు.
ఇక తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాన్ని 2006లో అప్పడు కాప్రా మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న వీ శ్రీనివాస్‌గౌడ్ మొదలుపెట్టారు. అప్పటికే ఉద్యమం మొదలైనా… గెజిటెడ్ అధికారులు కొంత భయంతో వెనకడుగు వేశారు. 2007 నుంచి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ వంటి అధికారులు టీజీఓ తరుపున శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే టీజీఓకు గుర్తింపు మాత్రం 2010లో వచ్చింది. ఈ పరిణామాల క్రమంలో శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. కేసీఆర్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా శ్రీనివాస్ గౌడ్ గెలిచారు. తొలి ప్రభుత్వంలో స్వామిగౌడ్ మండలి ఛైర్మన్‌గా ఉంటే… శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామిగౌడ్ పదవీకాలం పూర్తి అయింది. కానీ తిరిగి ఏ పదవి ఇవ్వలేదు. శ్రీనివాస్‌గౌడ్‌కు మాత్రం రెండోసారి మంత్రి పదవి దక్కింది. ఈ పరిణామాల్లో స్వామిగౌడ్ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు.
ఎవరిది పైచేయి..?
ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో వీరిద్దరి ప్రచారమే హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యమంలో ఉద్యోగులను కీలకం చేసిన స్వామిగౌడ్ ఓ వైపు నుంచి… ఉద్యమం కోసమే ఆవిర్భవించిన టీజీఓ నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండలి ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్ల కోసం తిరుగుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులను కలుపుకుని శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగ జేఏసీతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంతమందిని నేరుగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల జేఏసీ పక్షాన టీఎన్జీఓ, టీజీఓ మద్దతు తెలుపగా… తాజాగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం కూడా టీఆర్‌ఎస్‌కు జై కొట్టింది. అయితే ఈ పరిణామాల్లో రెండు రోజుల కిందట వరకు స్వామిగౌడ్ ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వమే పిలువకపోవడంతో ప్రచారానికి రాలేదనే ప్రచారం జరిగింది. కొంతమంది మాత్రం అనారోగ్య సమస్య అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై దిశ కథనం కూడా ప్రచురించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం స్వామిగౌడ్‌ను మండలి ప్రచారానికి తీసుకువచ్చింది. ముందుగా నల్గొండ నుంచి స్వామిగౌడ్ ప్రచారం మొదలుపెట్టారు. ఆయన కూడా ఉద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేస్తున్నారు. ఉద్యమంలో తనతో నిలిచిన వారందరితోనూ మంతనాలు చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుకు మద్దతుగా ఉండాలని చెప్పుతున్నారు. ఇటు స్వామిగౌడ్…అటు శ్రీనివాస్‌గౌడ్ ఇద్దరూ ఉద్యోగులతో చర్చలు సాగిస్తుండటంతో… ఎవరికి మద్దతు తెలుపాలనే అంశంపై ఉద్యోగులు కొంత సందిగ్థంలో పడ్డారు.
ఓటింగ్‌లో బీజేపీకి సహాకరించాలంటూ సూచన
మరోవైపు రాష్ట్రంలో అధికారంలో టీఆర్‌ఎస్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుకోవాలని, సైలెంట్‌గా ఓట్లు మాత్రం బీజేపీకి వేయాలంటూ స్వామిగౌడ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులతో అదే విషయం చెప్పుతున్నారు. అధికార పార్టీ కావడంతో ఎవో ఇబ్బందులు ఉంటాయని, దానికి బహిరంగంగా వారికి మద్దతు చెప్పుకోవాలని, కానీ ఓట్ల విషయంలో మాత్రం బీజేపీ వైపు ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇది కూడా కొన్నిచోట్ల వర్కవుట్ అవుతున్నట్లు బీజేపీ భావిస్తోంది. ఏది ఏమైనా మండలి పోరు మాత్రం ఇద్దరు బీసీ నేతల మధ్య రసవత్తరంగా మారింది.