బీటెక్ కాలేజీ నిర్వాకం.. రోడ్డెక్కి ధర్నాకు దిగిన విద్యార్థులు

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లాలో కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. మంచి కాలేజీలో చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని కలలు గన్న వారి జీవితాలు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. వారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా కాలేజీలో ఏ క్లాస్ కూడా జరగట్లేదని విద్యార్థులు ఆందోళన బాట పట్టిన ఘటన నర్సంపేట డివిజన్‌లోని జయముఖి కళాశాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న జయముఖి ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ […]

Update: 2021-11-15 04:27 GMT

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లాలో కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. మంచి కాలేజీలో చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని కలలు గన్న వారి జీవితాలు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. వారి తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా కాలేజీలో ఏ క్లాస్ కూడా జరగట్లేదని విద్యార్థులు ఆందోళన బాట పట్టిన ఘటన నర్సంపేట డివిజన్‌లోని జయముఖి కళాశాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న జయముఖి ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ గత కొన్ని ఏండ్లుగా బీటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ కోర్సులకు విద్యనందిస్తోంది. ఇదిలా ఉండగా గడచిన కొంత కాలంగా కళాశాలలోని అన్ని బ్రాంచ్‌లకు తరగతులు నిలిపివేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సోమవారం కళాశాలకు చేరుకున్న విద్యార్థులు ఎందుకు తరగతులు నిర్వహించట్లేదని ప్రశ్నించినా.. ఎవరూ సమాధానం చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ వైఖరిని నిరసిస్తూ జయముఖి కళాశాల ఎదుట విద్యార్థులుు ధర్నా చేపట్టారు.

10 నెలలుగా జీతాలు లేవు..!?

జయముఖి సంస్థలో పని చేస్తున్న ఫ్యాకల్టీకి దాదాపు పది నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఈ కారణంగా ఫ్యాకల్టీ ఒక్కొక్కరుగా కాలేజీకి రావడం మానేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని పేరెంట్స్ వాపోతున్నారు. గత వారం జరగాల్సిన మిడ్ ఎగ్జామ్స్ కూడా అర్ధాంతరంగా నిలిపివేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేటికీ పరీక్ష నిర్వహించడం లేదన్నారు.

ఫీజు తీసుకున్నారు.. క్లాసులు మరిచారు..?

జయముఖి కాలేజీలో బీటెక్ చదివే విద్యార్థులు సాధారణంగా మేనేజ్‌మెంట్ కోటాలో చేరితే ఏడాదికి రూ.40వేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగేండ్లకు ప్రతీయేటా ఇంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఆ విద్యా సంస్థలో చేరిన విద్యార్థుల భవిష్యత్.. యాజమాన్యం నిర్వాకంతో ఆగమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తరగతులు మొదలుపెట్టాలని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు రోడ్డెక్కడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News