ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎదిరించే వారి కోసం ఎదురుచూపులు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి టీఆర్ఎస్, మరొకటి బీజేపీ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నప్పటికీ ఈసారి విద్యార్థుల ఆలోచన ఎలాంటి ఫలితాలు ఇస్తుందోనని ఆ రెండు పార్టీలూ ఆందోళనలో ఉన్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు అప్పజెప్తూ ఉన్న […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకటి టీఆర్ఎస్, మరొకటి బీజేపీ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నప్పటికీ ఈసారి విద్యార్థుల ఆలోచన ఎలాంటి ఫలితాలు ఇస్తుందోనని ఆ రెండు పార్టీలూ ఆందోళనలో ఉన్నాయి. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు సంస్థలకు అప్పజెప్తూ ఉన్న ఉద్యోగాలను సైతం లేకుండా చేస్తోందని బీజేపీపై మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీలూ దొందూ దొందేనని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టసభల్లో ప్రశ్నించే గొంతు కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగిన తెగువ ఉన్న అభ్యర్థులపైనే విద్యార్థులు దృష్టి పెట్టారు.
సొంత ఓటర్లపైనే ఆశలన్నీ
ఓటర్ల జాబితాలో ఈ రెండు పార్టీలు దగ్గరుండి విద్యార్థుల పేర్లను నమోదు చేయించాయి. ఆ ఓటర్లపైనే ఇప్పుడు ఆ పార్టీలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మందిని ఓటర్లుగా చేర్పించినట్లు టీఆర్ఎస్ అంచనా. మరోవైపు బీజేపీ కూడా అలాంటి ఓటర్లనే నమ్ముకుంటోంది. ఇప్పటికే వారిని బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగతంగా కలిసి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఉద్యోగాల పేరిట దగా
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ దొంగలే. గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల పేరుతో మభ్యపెడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఖాళీ పోస్టులు ఉన్నా భర్తీ చేయలేదు. పక్క రాష్ట్రంలో నోటిఫికేషన్లు వస్తున్నాయి. చట్టసభల్లో ప్రశ్నిస్తారని బీజేపీ అభ్యర్థి రామచందర్ రావును గెలిపిస్తే దాన్ని నెరవేర్చలేకపోయారు. రాస్తారోకోలు, ధర్నాలు చేసి అరెస్టులపాలైతే కనీసం వచ్చి మమ్మల్ని పలకరించలేదు. మా భవిష్యత్తు కోసం నిజాయితీ అభ్యర్థి ఎవరో తేల్చుకుంటాం. – కోట శ్రీనివాస్, పరిశోధక విద్యార్థి, ఓయూ
బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు
టీఆర్ఎస్ చెబుతున్నట్లు 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అటెండర్ మొదలు అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు ఒక్క నియామకమూ జరగలేదు. అంతా ఓట్ల రాజకీయమే. బీజేపీ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. దీంతో మొత్తానికే ఉద్యోగ అవకాశాలే ఎగిరిపోతాయి. రిక్రూట్‌మెంట్ అసలే ఉండదు. ఆటోమేషన్ భయం ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు. ఈ రెండింటినీ ఓడిస్తాం. – క్రాంతి, నిరుద్యోగ జేఏసీ