త్యాగానికి ప్రతీకగా ‘జపాన్ టీ సెర్మనీ’ వేడుకలు!

దిశ, ఫీచర్స్ : తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయ ‘టీ వేడుకల’కు జపాన్ ప్రసిద్ధి. అక్కడ ‘టీ’ అంటే సాధారణ పానీయం కాదు, అలాగే ‘సెర్మనీ’ అంటే సాధారణ సందర్భమూ కాదు. ‘టీ సెర్మనీ’ అనేది స్వచ్ఛత, సామరస్యానికి ప్రతీక కాగా.. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహణకు జపాన్ అంతటా సన్నాహాలు జరుగుతుంటాయి. శతాబ్దాల కిందట మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఈ అందమైన వేడుక వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. ఇంతకీ ఆ కథ […]

Update: 2021-09-22 05:31 GMT

దిశ, ఫీచర్స్ : తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయ ‘టీ వేడుకల’కు జపాన్ ప్రసిద్ధి. అక్కడ ‘టీ’ అంటే సాధారణ పానీయం కాదు, అలాగే ‘సెర్మనీ’ అంటే సాధారణ సందర్భమూ కాదు. ‘టీ సెర్మనీ’ అనేది స్వచ్ఛత, సామరస్యానికి ప్రతీక కాగా.. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహణకు జపాన్ అంతటా సన్నాహాలు జరుగుతుంటాయి. శతాబ్దాల కిందట మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఈ అందమైన వేడుక వెనుక ఒక భయంకరమైన కథ ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటి? టీ వేడుకలు ఎలా నిర్వహిస్తారు? అసలు ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం.

సాధారణంగా సొంతింటి నుంచి దూరంగా ఒక చిన్న గుడిసెలో ‘టీ సెర్మనీస్’ జరుగుతాయి. ఇందుకోసం ఒక గదిని పువ్వులతో అందంగా అలంకరిస్తారు. అతిథులపై ప్రేమ, గౌరవాన్ని తెలిపేలా స్వాగత ద్వారాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అదే గుడిసెలో ఓ చిన్న పొయ్యిని ఏర్పాటు చేసి, వచ్చిన గెస్ట్‌ కోసం టీ తయారుచేసి ఇవ్వడంతో పాటు కొన్ని మిఠాయిలు కూడా అందిస్తారు.

ఎప్పుడు మొదలైందంటే?

చైనా నుంచి వచ్చిన ఐచే అనే బౌద్ధ సన్యాసి 9వ శతాబ్దంలో ‘చాయ్’ను జపాన్‌ ప్రజలకు పరిచయం చేశాడు. ఆ పానీయం రుచికి ఫిదా అయిపోయిన చక్రవర్తి.. జపాన్‌లో తేయాకు సాగు చేయాలని ఆదేశించాడు. 13వ శతాబ్దం నాటికి ‘టీ’ అక్కడ ఓ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. సమురాయ్‌లు కూడా విలాసవంతమైన టీ-టేస్ట్ వేడుకల్లో పాల్గొనగా, ఇక్కడ వివిధ రకాల చాయ్ రుచులకు బహుమతులు కూడా ఇచ్చేవారు.

ఆద్యుడు ఆయనే

జపాన్ టీ సంస్కృతి చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి సేన్ కో రిక్యూ. ఈ బౌద్ధ సన్యాసి జపనీస్ టీ వేడుక పితామహుడిగా పేరుగాంచాడు. టీ వేడుకకు సంబంధించి అతిథులకు మర్యాద.. ఆహారం, పానీయం పట్ల గౌరవం.. ఆత్మలోని స్వచ్ఛత, జీవితంలో లభించే ప్రశాంతత వంటి నాలుగు ప్రధాన విలువలను పరిచయం చేసింది రిక్యూనే.

ప్రాణ త్యాగం..

రిక్యూ.. సమురాయ్ రీజెంట్ టయోటోమి హిడియోషిను గురువుగా అభివర్ణించేవాడు. కాగా దేశంలో రిక్యా మొదలెట్టిన టీ ఆచార సంప్రదాయాన్ని వ్యాప్తి చేయడంలో మొదట్లో ఆయనే మద్దతుగా నిలిచాడు. ఇదే క్రమంలో చాయ్ రాజకీయ, సాంస్కృతిక కరెన్సీగా.. శక్తి, ప్రభావాన్ని ప్రదర్శించే సాధనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘టీ వేడుకలపై’ సొంత ఆలోచనలు కలిగివున్న హిడియోషి.. రిక్యూకు అనుకూలంగా ఉండలేకపోయాడు. క్రమంగా వారి స్నేహానికి బీటలు వారడంతో రిక్యూను తన రాజకీయాలకు ఓ అడ్డంకిలా చూడటం ప్రారంభించాడు. దీంతో 1591 సంవత్సరంలో హిడెయోషి.. రిక్యూను ఆత్మహత్య చేసుకోవాలని ఆదేశించాడు. నిస్వార్థపరుడైన రిక్యూ గురువు ఆదేశాలను పాటిస్తూ.. ఆఖరి క్షణాల్లో తాను ఆత్మార్పణ చేసుకునేందుకు ఉపయోగించే బాకు గురించి ఒక కవిత రాయడం విశేషం.

జపాన్ ప్రజలు అతడి సంప్రదాయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేయడంతో రిక్యూ త్యాగం వృథా కాలేదు. దీంతో ఆనాటి నుంచి టీ వేడుకలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News