యువ క్రికెటర్‌కు గుండెలో రంధ్రం.. ఆలస్యంగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి

భారత యువ క్రికెటర్, ఢిల్లీకి చెందిన యశ్ ధుల్‌‌ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు.

Update: 2024-08-28 15:04 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత యువ క్రికెటర్, ఢిల్లీకి చెందిన యశ్ ధుల్‌‌ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, క్రికెట్ ఫాలో అయ్యే వారు ఈ యువ బ్యాటర్ పేరు వినే ఉంటారు. 2022లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు అతనే కెప్టెన్. యశ్ ధుల్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అతనికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉందట. ఇటీవలే హార్ట్ సర్జరీ కూడా చేయించుకున్నాడట. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది.

ప్రస్తుతం యశ్ ధుల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌(డీపీఎల్) ఆడుతున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా అతని చిన్ననాటి కోచ్ ప్రదీప్ కొచర్ ధుల్‌‌కు సంబంధించిన గుండె జబ్బు గురించి బయటపెట్టాడు. ‘నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన సాధారణ హెల్త్ చెకప్‌లో ఎన్‌సీఏ మెడికల్ టీమ్ ధుల్ గుండెలో రంధ్రం ఉన్నట్టు గుర్తించింది. మెడికల్ టీమ్ సూచన మేరకు ధుల్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు.’ అని తెలిపాడు. ధుల్ తండ్రి విజయ్ స్పందిస్తూ.. ధుల్‌కు చిన్నప్పటి నుంచి గుండెలో రంధ్రం ఉందని, అయితే, తీవ్రమైనది కాదని చెప్పాడు. ధుల్ దీర్ఘకాలిక ఆరోగ్యం, క్రికెట్ కెరీర్ కోసం శస్త్ర చికిత్స చేయించినట్టు తెలిపాడు.

సర్జరీ నుంచి కోలుకున్న ధుల్‌ మైదానంలో అడుగుపెట్టాడు. ఎన్‌సీఏ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వడంతో అతను ప్రస్తుతం డీపీఎల్‌లో ఆడుతున్నాడు. అయితే, డీపీఎల్‌లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌‌కు ఆడుతున్న ధుల్ ఐదు ఇన్నింగ్స్‌లో 93 పరుగులే చేశాడు. మంగళవారం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం యశ్ ధుల్ మాట్లాడుతూ..‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. కోలుకుని తిరిగి వచ్చాను. నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా.’ అని చెప్పాడు. కాగా, త్వరలోనే ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో యశ్ ధుల్‌కు చోటు దక్కలేదు. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన అతను అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. 4 మ్యాచ్‌ల్లో 16 పరుగులే చేశాడు. 

Tags:    

Similar News