అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళల రెజ్లింగ్ జట్టు
అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో ఐదో బంగారు పతకం చేరింది.
దిశ, స్పోర్ట్స్ : జోర్డాన్‌లో జరుగుతున్న అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో ఐదో బంగారు పతకం చేరింది. శనివారం భారత రెజ్లర్ కాజల్ 69 కేజీల కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండ్రా రైబాక్‌ను 9-2 తేడాతో చిత్తు చేసి స్వర్ణం సాధించింది. మరోవైపు, 46 కేజీల కేటగిరీలో శ్రుతిక రజతంతో సరిపెట్టింది. ఫైనల్‌లో జపాన్ రెజ్లర్ యుయు కట్సుయే చేతిలో 11-0 తేడాతో శ్రుతిక పరాజయం పాలైంది. మరోవైపు, బాల రాజ్(40 కేజీలు) , ముస్కాన్(53 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌ల్లో బాల రాజ్ 11-5 తేడాతో మొనకా ఉమెకావా(జపాన్)ను మట్టికరిపించగా.. ముస్కాన్ 12-2 తేడాతో ఇసాబెల్లా గొంజాల్స్(అమెరికా)ను ఓడించింది. శుక్రవారం అదితి కుమారి(43 కేజీలు), నేహా(57 కేజీలు), పుల్కిత్(65 కేజీలు), మాన్సి లాథర్(73 కేజీలు) బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు 8 పతకాలు కైవసం చేసుకోగా.. అందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళ జట్టు 185 పాయింట్లతో తొలిసారిగా చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.