అమ్మాయిలు అదరహో.. హాకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు అర్హత
భారత మహిళల హాకీ జూనియర్ జట్టు అదరగొడుతున్నది.
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జూనియర్ జట్టు అదరగొడుతున్నది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలవడానికి అడుగు దూరంలోని నిలిచింది. మస్కట్‌లో జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ సంచలన ప్రదర్శనతో టైటిల్‌కు చేరువైంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో జపాన్‌ను చిత్తు ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత అమ్మాయిలు 1-3 తేడాతో జపాన్‌ను ఓడించారు. ఆరంభంలోనే మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తీసుకుంది.
4వ నిమిషంలోనే ముంతాజ్ ఖాన్ ఫీల్డ్ గోల్ ఖాతా తెరిచింది. ఆ తర్వాతి నిమిషంలోనే సాక్షి రాణా గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచింది. టోర్నీలో భీకర ఫామ్‌లో ఉన్న దీపిక సెమీస్‌లోనూ సత్తాచాటింది. 13వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. తొలి క్వార్టర్‌లోనే భారత్ మూడు గోల్స్ చేసి 3-0తో పట్టు సాధించింది. అనంతరం మరో గోల్ చేయనప్పటికీ భారత ప్లేయర్లు ప్రత్యర్థిని నిలువరించారు. అయితే, 23వ నిమిషంలో మరుయామ నికో జపాన్ తరపున గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది. జపాన్‌కు అదే తొలి గోల్, చివరి గోల్ కూడా.
అనంతరం ఒత్తిడిలోకి వెళ్లిన జపాన్ గోల్ చేసే అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆఖరి రెండు క్వార్టర్లలో నాలుగు పెనాల్టీ కార్నర్లు దక్కినా.. గోల్‌గా మల్చలేకపోయింది. ఆఖరి వరకూ లీడ్‌ను కాపాడుకున్న భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో చైనా లేదా సౌత్ కొరియాతో తలపడనుంది.