టీ20 వరల్డ్ కప్ కంటే ముందే భారత్, పాక్ పోరు.. ఎప్పుడంటే?

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌‌లో భాగంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కంటే ముందే దాయాదుల పోరు చూడబోతున్నాం.

Update: 2024-03-26 17:44 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌‌లో భాగంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కంటే ముందే దాయాదుల పోరు చూడబోతున్నాం. మహిళల ఆసియా కప్‌లో భారత్, పాక్ జట్లు జూలై 21న ఎదురుపడనున్నాయి. జూలైలో జరగబోయే మహిళల ఆసియా కప్(టీ20 ఫార్మాట్)‌ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మంగళవారం ప్రకటించింది. జూలై 19 నుంచి 28 వరకు టోర్నీ జరగనుంది.

టోర్నీ చరిత్రలో ఈ ఎడిషన్‌లో అత్యధికంగా 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులు విభజించారు. గ్రూపు ఏలో భారత్‌తోపాటు పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌ జట్లను చేర్చగా.. గ్రూపు-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూపులోని ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో చెరో మ్యాచ్ ఆడనుంది. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. జూలై 26న సెమీస్ మ్యాచ్‌లు, జూలై 28న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

భారత్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

ఈ టోర్నీలో భారత్‌కు తిరుగులేని రికార్డు సొంతం. 8 ఎడిషన్లలో ప్రతి ఎడిషన్‌లోనూ భారత జట్టు ఫైనల్‌కు చేరుకోగా.. 7సార్లు విజేతగా నిలిచింది. చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టబోతున్న టీమ్ ఇండియా జూలై 19న యూఏఈతో తలపడటం ద్వారా టోర్నీని ఆరంభించనుంది. ఆ తర్వాత జూలై 21న పాక్‌తో, 23న నేపాల్‌తో తలపడనుంది. 

Tags:    

Similar News