ద్రవిడ్‌ను కొనసాగిస్తారా?.. సాగనంపుతారా?

వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది.

Update: 2023-11-20 16:40 GMT

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. టోర్నీలో మొదటి నుంచి ఎదురన్నదే లేకుండా ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ ఇండియా ఫైనల్ పోరులో తడబడి కప్‌ను చేజార్చుకుంది. భారత ఆటగాళ్లు పోరాడినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. ప్రపంచకప్‌ను కోల్పోయిన బాధలో ఉన్న టీమ్ ఇండియాకు మరో బ్యాడ్‌ న్యూస్. ఈ వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. వన్డే ప్రపంచకప్ నాటికి బీసీసీఐతో ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్‌గా అతని పదవీ కాలం పొడిగిస్తారా? లేదా కొత్త హెడ్ కోచ్‌ను నియమిస్తారా? అనేది దానిపై చర్చ మొదలైంది. దీనిపై ఇంకా బీసీసీఐలో చర్చ జరగలేదని తెలుస్తోంది.

భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నుంచి ద్రవిడ్ బాధ్యతలు చేపట్టాడు. 2021 నవంబర్‌లో ద్రవిడ్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ఐసీసీ ఈవెంట్లలో భారత్ వైఫల్యం నేపథ్యంలో ఆ విషయంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనిపై ఒత్తిడి ఉంది. అయితే, అతని రెండేళ్ల కాలంలోనూ జట్టు ఐసీసీ టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. అతను జట్టులో పలు మార్పులకు శ్రీకారం చుట్టాడనేది వాస్తవం.

యువ క్రికెటర్లను ప్రోత్సహించి బెంచ్‌ను పటిష్టం చేయడంలో అతని చొరవ కీలకం. ఒకే సమయంలో టీమ్ ఇండియా రెండు వేర్వేరు పర్యటనలకు వెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో యువకుల జట్టు ఆసియా క్రీడల చాంపియన్‌గా నిలిచిందంటే ద్రవిడ్ చొరవ ఉందని కచ్చితంగా చెప్పొచ్చు. అయితే, ఐసీసీ టైటిల్ నిరీక్షణకు మాత్రం తెరదించలేకపోయాడు.

అతని పదవీ కాలంలో భారత జట్టు‌ను గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు.. ఈ ఏడాది టెస్టు చాంపియన్‌షిప్‌లో, వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌కు దాదాపు ఆరు నెలలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌ను కొనసాగించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే, ద్రవిడ్‌ను తప్పిస్తే భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ద్రవిడ్ గైర్హాజరులో లక్ష్మణ్ పలు సిరీస్‌‌లకు కోచ్‌గా వ్యవహరించాడు. మరోవైపు, విదేశీ కోచ్‌ను నియమించే చాన్స్ ఉందని కూడా చర్చ జరుగుతుంది. సౌతాఫ్రికా‌కు చెందిన గ్యారీ కిర్‌స్టన్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ 2011 వన్డే వరల్డ్ కప్ గెలుచుకోగా..డంకన్ ఫ్లెచర్(జింబాబ్వే) పదవీకాలంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.

ఈ క్రమంలో బోర్డు విదేశీ కోచ్‌ వైపు కూడా మొగ్గుచూపే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ నెల 23 నుంచి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టీ20 సిరీస్‌ ఆడనుంది. దాంతో హెడ్ కోచ్‌ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.

ఏం జరుగుతుందో తెలియదు

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా పదవీకాలం ముగియడంపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు టోర్నీపైనే దృష్టి పెట్టానని, కాంట్రాక్ట్ గురించి అస్సలు ఆలోచించలేదని చెప్పాడు. ‘అసలు తీరిక లేదు. వరల్డ్ కప్‌పై ఫోకస్ పెట్టాను. సమయం ఉంటే ఆలోచించేవాడినేమో. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే దానిపై ప్లాన్స్‌ ఏం లేవు. రెండేళ్లపాటు జట్టుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌కు కోచ్‌గా వ్యవహరిస్తారా? అనే ప్రశ్నకు స్పందించేందుకు ద్రవిడ్ ఆసక్తి చూపలేదు.


Similar News