Smriti Mandhana: మంధాన షాకింగ్ డెసిషన్.. దేశం కోసం బడా లీగ్‌కు దూరం!

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2023-08-29 10:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న తొలి మహిళల బిగ్ బ్యాష్ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్)లో ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం గురించి తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ టోర్నీలో మంధాన చెలరేగుతుందని ఆశించిన క్రికెట్ ప్రేమికులకు ఈ నిర్ణయం షాకిచ్చింది.

ఇటీవల ముగిసిన 'ది హండ్రెడ్' మహిళల టోర్నీలో మంధాన మెరిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బ్యాష్ లీగ్‌లో కూడా ఆమె రాణిస్తుందని అంతా అనుకున్నారు. దీంతో ఆమె కోసం వేలంలో గట్టి పోటీ కూడా ఉంటుందని భావించారు. కానీ ఈ అంచనాలను తలకిందులు చేసిన మంధాన.. అసలు ఈ టోర్నీలో ఆడకూడదని డిసైడ్ అయింది. మొట్టమొదటి డబ్ల్యూబీబీఎల్‌లో ఓవర్సీస్ ప్లేయర్ల డ్రాఫ్ట్‌లో మంధాన పేరు లేదు. మొత్తం 122 మంది ప్లేయర్లు ఈ ఓవర్సీస్ డ్రాఫ్ట్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

భారత్ నుంచి 18 మంది ఈ జాబితాలో ఉండగా.. వీరిలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెజ్ తదితరులు కూడా ఉన్నారు. అయితే ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్న మంధాన.. దేశవాళీలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ 19 నుంచి జనవరి 26 వరకు దేశవాళీ క్రికెట్ జరుగుతుంది. దీనిపై మంధాన బాగా ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ మహిళల టీ20 ట్రోఫీతో ఈ దేశవాళీ సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ ట్రోఫీ, సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ, టీ20 ఛాలెంజర్ ట్రోఫీ, ఇంటర్ జోనల్ వన్డే ట్రోఫీ జరుగుతాయి. అదే సమయంలో అందరూ ఎదరు చూస్తున్న డబ్ల్యూబీబీఎల్ తొలి సీజన్ అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 2 వరకు జరుగుతుంది. ఈ డబ్ల్యూబీబీఎల్ షెడ్యూల్.. భారత హోం సీజన్‌తో క్లాష్ అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబరు, జనవరి నెలల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు భారత్‌లో పర్యటిస్తాయి. ఈ సందర్భంగా భారత మహిళలు ఒక టెస్టు, 9 వైట్ బాల్ మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంధాన.. డబ్ల్యూబీబీఎల్‌ నుంచి తప్పుకొని, దేశవాళీలపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Similar News