IND VS NZ : నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభం.. పొంచి ఉన్న వర్షం ముప్పు

ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది.

Update: 2024-10-15 19:01 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. బుధవారం నుంచి బెంగళూరు వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. బంగ్లాపై రెచ్చిపోయిన ప్లేయర్లే ఈ సిరీస్‌కూ భారత జట్టులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉన్న రోహిత్ సేన ఈ సిరీస్‌లో ఫేవరెట్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇటీవల శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కోల్పోయింది. ఏ రకంగా చూసుకున్నా కివీస్‌తో పోలిస్తే టీమిండియా బలంగా ఉంది. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి లేదు. నాణ్యమైన ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. మరోవైపు, బెంగళూరు టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించే విషయం. మరి, వరుణుడు కరుణిస్తాడో?లేదో? చూడాలి.

గిల్ డౌటే.. భర్తీ చేసేదెవరు?

తొలి టెస్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను మెడనొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. దీంతో బెంగళూరు టెస్టుకు అతను ఆడటం డౌటే. అయితే, బెంచ్ బలంగా ఉండటంతో కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ ద్రవిడ్‌కు ఆ విషయంలో తలనొప్పి లేదు. గిల్ స్థానాన్ని భర్తీ చేయడానికి యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. వీరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. బంగ్లాతో రెండు టెస్టుల్లో వీరికి తుది జట్టులో చోటు దక్కలేదు. అన్ని విభాగాల్లో భారత జట్టు బలంగా ఉంది. రోహిత్, జైశ్వాల్ జట్టుకు దూకుడు ఆరంభాన్ని ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని బ్యాటు ఝుళిపిస్తున్నారు. బంగ్లాపై నిరాశపర్చిన కోహ్లీ ఫామ్ అందుకుంటే జట్టుకు ఢోకా ఉండదు. కేఎల్ రాహుల్ నుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశిస్తున్నది. రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ ఫామ్‌లో ఉండటం సానుకూలంశం. అశ్విన్, జడేజా బ్యాటుతో ఏం చేయగలరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, సొంత మైదానాల్లో వారి స్పిన్‌కు తిరుగులేదు. మరోవైపు, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్‌లతో పేస్ దళం కూడా పటిష్టంగా ఉన్నది.

కివీస్‌లో వీళ్లు

తొలి టెస్టుకు కేన్ విలియమ్సన్, పేసర్ బెన్ సియర్స్ దూరమవడం న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బే. అయితే, ఆ జట్టులో టామ్ లాథమ్, డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వంటి బ్యాటర్లు ప్రమాదకరమే. వారిని కట్టడి చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే, కివీస్ బ్యాటర్లలో నిలకడలేమి లేకపోవడం ప్రధాన సమస్య. అయితే, భారత సంతతి బ్యాటర్ రచిన్ రవీంద్ర మాత్రం కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. కివీస్ బౌలర్లలో విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్ నుంచి భారత బ్యాటర్లకు సవాల్ తప్పదు.

వర్షం ముప్పు

ఇటీవల బంగ్లాదేశ్‌తో కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టుకు వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. తొలి మూడు రోజులు అభిమానులు నిరాశకు గురవ్వగా.. ఆఖరి రెండు రోజుల్లోనే భారత్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నది. మంగళవారం ఉదయం నుంచి బెంగళూరులో వర్షం పడింది. దీంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ రద్దైంది. అలాగే, మ్యాచ్ జరిగే ఐదు రోజులూ బెంగళూరులో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నివేదికలు అంచనా వేశాయి. మొదటి రెండు రోజులు 70-90 శాతం వర్షం పడే చాన్స్ ఉండటంతో బుధ, గురు వారాలు ఆట వర్షార్పణమయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా మూడు రోజులు కూడా వర్ష సూచన ఉన్నది. దీంతో మ్యాచ్ జరుగుతుందా?లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

భారత్ ఆధిపత్యం కొనసాగేనా?

టెస్టుల్లో న్యూజిలాండ్‌పై భారత్‌‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా 22 మ్యాచ్‌ల్లో టీమిండియానే నెగ్గింది. 13 మ్యాచ్‌ల్లో కివీస్ విజయం సాధించింది. 27 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మరోవైపు, సొంతగడ్డపై కివీస్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. 1988 నుంచి న్యూజిలాండ్ భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవలేదు.

Tags:    

Similar News