IPL 2025 : చెన్నయ్ కోట బద్దలు కొట్టిన ఆర్సీబీ.. చెపాక్‌లో భారీ విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బెంగ తీరింది.

Update: 2025-03-28 19:38 GMT
IPL 2025 : చెన్నయ్ కోట బద్దలు కొట్టిన ఆర్సీబీ.. చెపాక్‌లో భారీ విజయం
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బెంగ తీరింది. చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత విజయం రుచిచూచింది. 2008లో చివరిసారిగా నెగ్గిన ఆర్సీబీ.. అక్కడ మరో విజయం సాధించడానికి 17 ఏళ్ల పట్టింది. చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను ఓడించింది. చెన్నయ్‌లోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 50 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(51) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిల్ సాల్ట్(32), కోహ్లీ(31), పడిక్కల్(27), టిమ్ డేవిడ్(22) విలువైన పరుగులు జోడించారు. ఆ తర్వాత ఛేదనలో కనీసం పోటీ ఇవ్వలేకపోయిన చెన్నయ్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. హేజల్‌వుడ్(3/21), యశ్ దయాల్(2/18), లివింగ్‌స్టోన్ (2/28) బంతితో విజృంభించి సీఎస్కే పతనాన్ని శాసించారు. రచిన్ రవీంద్ర(41), ధోనీ(30 నాటౌట్) పోరాడగా.. మిగతా వారు తేలిపోవడంతో చెన్నయ్‌కు ఓటమి తప్పలేదు. టోర్నీలో బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో ముంబైపై నెగ్గిన చెన్నయ్ ఈ సీజన్‌లో తొలి ఓటమిని పొందింది.

చెన్నయ్ కట్టడి

హోం గ్రౌండ్‌లో చెన్నయ్ కనీసం పోరాటం చేయలేకపోయింది. హేజల్‌వుడ్, యశ్ దయాల్, లివింగ్‌స్టోన్ సమిష్టిగా బౌలింగ్ చేసి సీఎస్కేను కట్టడి చేశారు. దీంతో చెన్నయ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తీవ్రంగా తడబడుతూనే సాగింది. రాహుల్ త్రిపాఠి(5), కెప్టెన్ గైక్వడ్(0), దీపక్ హుడ(4), సామ్ కర్రన(8) దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర చాలా సేపు పోరాడాడు. అయితే, మరో ఎండ్‌లో అతనిలా ధాటిగా ఆడే వారు కరువయ్యారు. దూబె(19), అశ్విన్(11) వికెట్లు పారేసుకోవడంతో చెన్నయ్ 99 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఇలా పేలవ ఇన్నింగ్స్‌లోనూ సీఎస్కే అభిమానులకు ఊరటనిచ్చే విషయం ధోనీ మెరవడం. మాహీ 30 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. 16 బంతులు ఎదుర్కొన్న అతను 3 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు. ధోనీ రాణించడంతో చెన్నయ్ కష్టంగా 146 పరుగులు చేయగలిగింది.

ఆర్సీబీ సమిష్టిగా..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు సమిష్టిగా రాణించింది. బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. మొదట ఫిల్ సాల్ట్ తనదైన శైలిలో మెరుపులు మెరిపించి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. అతను క్రీజులో ఉన్నంత సేపు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, 5వ ఓవర్‌ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో అతను స్టంప్ అవుటయ్యారు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్(27) కాసేపు ధాటిగా ఆడి వెనుదిరిగాడు. వికెట్లు పడుతుండటంతో నిదానంగా ఆడిన విరాట్ కీలక పరుగులు జోడించాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుటవడంతో ఆర్సీబీలో టెన్షన్ మొదలైంది. ఈ పరిస్థితుల్లో రజత్ పటిదార్ జట్టు భారాన్ని మీదేసుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 రన్స్ చేశాడు. అయితే, మరో ఎండ్‌లో లివింగ్‌స్టోన్(10), జితేశ్ శర్మ(12), కృనాల్ పాండ్యా(0) దారుణంగా విఫలమవడంతో అతనే ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే రజత్ కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ఇక, ఆఖర్లో టిమ్ డేవిడ్(22 నాటౌట్) రెచ్చిపోయాడు. చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టడంతో ఆర్సీబీ 196 స్కోరు చేసింది.

Tags:    

Similar News