కోహ్లీని పక్కనపెడుతున్నారా?.. కారణమదేనా?
టీ20 వరల్డ్ కప్‌కు విరాట్‌ను పక్కనపెట్టాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీని పక్కనపెడుతున్నారా?.. ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు కష్టమేనా?.. సెలెక్టర్లు అతని వైపు మొగ్గు చూపడం లేదా?.. అంటే బీసీసీఐ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. టీ20 వరల్డ్ కప్-2022 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విరాట్ జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలోనే అతను రీఎంట్రీ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే, టీ20 వరల్డ్ కప్‌కు విరాట్‌ను పక్కనపెట్టాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాను రోహిత్ శర్మనే నడిపిస్తాడని బీసీసీఐ సెక్రెటరీ జై షా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. అయితే, టీ20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ స్థానంపై అనుమానాలు ఉన్నాయని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంపై కోహ్లీతో కూడా మాట్లాడాడని సదరు మీడియా సంస్థ చెప్పుకొచ్చింది. ఈ వార్త ప్రస్తుతం భారత అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నది. మరోవైపు, ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ సీజన్‌లో కోహ్లీ సత్తాచాటితే అతని విషయంలో సెలెక్టర్లు యూటర్న్ తీసుకునే వీలు ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించడానికి మే 1 చివరి తేదీ. జట్టును ప్రకటిస్తేనే కోహ్లీ విషయంలో స్పష్టత రానుంది. మరి, దీనిపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
కారణమదేనా?
టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ గొప్పగా రాణించలేదని, ప్రస్తుతం పొట్టి క్రికెట్ మెరుపులకు అతని ఆట తీరు సరిపోదనే కారణంతోనే సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, వెస్టిండీస్, అమెరికా పిచ్‌లు స్లోగా ఉండటం, కోహ్లీ బ్యాటింగ్ శైలికి సరిపోకపోవచ్చనేది మరో కారణంగా తెలుస్తోంది. కాబట్టి, కోహ్లీ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబె వంటి యువకులను జట్టులోకి తీసుకోవాలనేది సెలెక్టర్ల ఆలోచనగా అర్థమవుతున్నది. అయితే, టీ20 వరల్డ్ కప్-2022లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. పాక్‌పై విరాట్ అడిన ఇన్నింగ్స్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అంతేకాకుండా, ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 98.67 సగటుతో 136.41 స్ట్రైక్ రేటుతో 296 పరుగులు చేశాడు. అతనే టాప్ స్కోరర్ కూడా. కాబట్టి, కోహ్లీ ప్రదర్శనను సెలెక్టర్లు దృష్టిలో పెట్టుకోవాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.