Paris Olympics : సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగట్.. పతకానికి అడుగు దూరంలో

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్ పతకానికి అడుగుదూరంలో నిలిచింది.

Update: 2024-08-06 11:52 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. తాజాగా మహిళల 50 కేజీల కేటగిరీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సుసాకి(జపాన్)ను ఓడించిన వినేశ్.. క్వార్టర్స్‌లోనే అదే జోరు కొనసాగించింది. ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను 7-5 తేడాతో మట్టికరిపించింది. వినేశ్ అసాధారణ నైపుణ్యాలు, వ్యూహాత్మకంగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. చివరి 45 సెకన్లలో ఉక్రెయిన్ రెజ్లర్ దూకుడుగా పెంచగా.. చివరి 20 సెకన్లలో వినేశ్ నాలుగు పాయింట్లు పొంది విజేతగా నిలిచింది. దీంతో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్‌లో అడుగుపెట్టింది. మంగళవారమే జరిగే సెమీస్‌లో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్‌తో తలపడనుంది. ఆ బౌట్‌లో వినేశ్ గెలిస్తే కనీసం రజతం ఖాయమవుతుంది. అయితే, వినేశ్ జోరు చూస్తుంటే స్వర్ణం కొల్లగొట్టేలా కనిపిస్తున్నది.  

Tags:    

Similar News