US Open 2024: యూఎస్ ఓపెన్ లో.. ఫైనల్ కి దూసుకెళ్లిన సబలెంకా!
యూఎస్ ఓపెన్-2024 లో.. మహిళల విభాగం నుంచి అరినా సబలెంకా ఫైనల్ కు దూసుకెళ్లింది.
దిశ, వెబ్ డెస్క్: యూఎస్ ఓపెన్-2024 లో.. మహిళల విభాగం నుంచి అరినా సబలెంకా ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం(సెప్టెంబర్ 5) అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అమెరికన్ స్టార్ ప్లేయర్ ఎమ్మా నవారోపై.. సబలెంకా 6-3, 7-6(2) తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. సబలెంకా ఈ విజయంతో వరుసగా రెండవ సారి యూఎస్ ఓపెన్ ఫైనల్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది. అమెరికన్ మాజీ స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. 2018, 2019 లలో తొలిసారిగా ఈ ఫీట్ ను అందుకోగా, ఇప్పుడు అదే ఫీట్ ను అరినా సబలెంకా కొనసాగించింది.
కాగా, సబలెంకా 2023 ఫైనల్ మ్యాచ్ లో అమెరికన్ ప్రొఫెషనల్ ప్లేయర్ కోకో గాఫ్ చేతిలో పోరాడి ఓడిపోయింది. యూఎస్ ఓపెన్ లో ఇప్పుడు ఎమ్మా నవారో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నవారో ఓడిన మరో సెమీఫైనల్ లో అమెరికన్ స్టార్ ప్లేయర్ జెస్సికా పెగులా ఫైనల్ కు చేరింది. పెగులా 1-6, 6-4, 6-2 తేడాతో ఓడిపోయే మ్యాచ్ లో ముచోవాపై గెలిచింది. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను ఓడిపోయిన పెగులా, రెండో సెట్ లో 0-2 లో కొంచెం వెనకబడ్డా తర్వాత పుంజుకొని రెండవ సెట్ ను చేజిక్కించుకుంది. తర్వాత నిర్ణయాత్మక మూడవ సెట్ లో ప్రత్యర్థికి అసలు అవకాశం ఇవ్వకుండా 6-2 తేడాతో అలవోకగా గెలిచింది. అయితే సెప్టెంబర్ 8 న జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో పెగులాతో సబలెంకా తలపడనుంది.