షమీ ఈజ్ బ్యాక్.. రంజీ మ్యాచ్‌లో రెచ్చిపోయిన పేసర్
దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ వికెట్ల వేట మొదలుపెట్టాడు.
దిశ, స్పోర్ట్స్ : దాదాపు ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ వికెట్ల వేట మొదలుపెట్టాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం, సర్జరీ కారణంగా ఆటకు దూరమైన అతను రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్, బెంగాల్ మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు. బెంగాల్‌కు ఆడుతున్న అతను మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం రెచ్చిపోయాడు.
తొలి రోజు ఒక్క వికెట్ కూడా తీయని షమీ రెండో రోజు మాత్రం రెచ్చిపోయాడు. 9 ఓవర్లు వేసిన అతను 20 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌కు ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తాను సిద్ధమే అని సెలెక్టర్లకు సందేశం పంపాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోరు 103/1తో గురువారం ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్.. బెంగాల్ బౌలర్ల ధాటికి తేలిపోయింది. షమీ 4 వికెట్లు, సూరజ్, కైఫ్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. దీంతో మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. సుభ్రాన్ష్ సేనాపతి(47) టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 228 రన్స్ చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగాల్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 170 రన్స్ చేసింది. దీంతో బెంగాల్ 231 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.