చాగురామా : అండర్ 19 వరల్డ్ కప్-2022లో టీం ఇండియా కుర్రాళ్లు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆతిథ్య వెస్టిండీస్‌లో బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఆదివారం సూపర్ లీగ్ దశలో భాగంగా ఇండియా వర్సెస్ ఉగాండా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మన కుర్రాళ్లు దంచి కొట్టారు. ఓపెనర్లకు తోడు టాప్ ఆర్డర్ కూడా అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత జట్టు 405 పరుగులు సాధించింది.
టీం ఇండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉగాండా జట్టు ఆటగాళ్లను భారత బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో 19.4 ఓవర్లలోనే 79 పరుగులకే చేతులెత్తేశారు. దీంతో అండర్ -19 వరల్డ్ కప్‌లో 326 భారీ పరుగుల తేడాతో విజయం సాధించిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది. నాలుగుసార్లు చాంపియన్స్ అయిన భారత జట్టు లీగ్ దశలో అన్ని మ్యాచులు వరుసగా గెలుపొందింది. ఓపెనర్ రఘువంశీ 120 బంతుల్లో 144 పరుగులు, బావా 108 బంతుల్లో 162 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.