అప్పుడు వినేశ్ చనిపోతుందేమోనని భయపడ్డా..సంచలన విషయాలు చెప్పిన ఆమె కోచ్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ అదనపు బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయిన విషయం తెలిసిందే.

Update: 2024-08-16 12:59 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ అదనపు బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయిన విషయం తెలిసిందే. 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరిన ఆమె 100 గ్రాములు అదనంగా ఉండటంతో వేటు వేశారు. అదనపు బరువును తగ్గించుకునేందుకు వినేశ్ రాత్రంతా కష్టపడినా.. జెర్సీని, జట్టును కత్తిరించుకున్నా ఫలితం దక్కలేదు. తాజాగా వినేశ్ కోచ్ వోలర్ అకోస్ బరువు తగ్గడానికి వినేశ్ చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. అయితే, కాసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. అప్పటికే ఆ పోస్టు వైరల్‌గా మారింది.

ఆ పోస్టులో అకోస్..రాత్రంతా వినేశ్ పడిన కష్టాన్ని వివరించాడు. ‘సెమీ ఫైనల్ తర్వాత ఆమె 2.7 కేజీలు పెరిగింది. గంటా 20 నిమిషాల తర్వాత ఇంకా 1.5 కేజీల బరువు మిగిలి ఉంది. 50 నిమిషాలు ఆవిరి స్నానంలో పాల్గొన్నా చెమట రాలేదు. దీంతో వినేశ్ వివిధ కార్డియో మెషిన్స్ ట్రై చేసింది. రెజ్లింగ్ మూవ్స్‌ చేసింది. ఉదయం 5:30 వరకు అలాగే చేసింది. మధ్యలో రెండు, మూడు నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ మళ్లీ స్టార్ట్ చేసింది. అలా చేస్తుండగా ఆమె కుప్పకూలింది. ఆమెను లేపాం. గంట సేపు ఆవిరి స్నానం చేసింది. నేనేదో ఉద్దేశపూర్వకంగా చెప్పడం లేదు. అప్పుడు ఆమెను చూస్తుంటే ఆమె జీవితం గురించి భయమేసింది. ఆమె చచ్చిపోతుందేమోనని ఆందోళన పడ్డా.’ అని రాసుకొచ్చాడు.

వరల్డ్‌లోనే నేను బెస్ట్ అని నిరూపించుకున్నా..

ఆహారం, నీళ్లు తీసుకోకుండా రాత్రంతా కష్టపడటంతో వినేశ్ అస్వస్థతకు గురై ఆస్ప్రతిలో చేరిన విషయం తెలిసిందే. హాస్పిటల్‌లో వినేశ్‌తో జరిగిన చర్చను కూడా కోచ్ అకోస్ వివరించాడు. ‘కోచ్ బాధపడకండి. వరల్డ్ చాంపియన్ యుయి సుసాకి(జపాన్)నిఓడించాను. నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా. ప్రపంచంలో నేను అత్యుత్తమ రెజ్లర్ అని నిరూపించుకున్నా. పతకాలు, పోడియం కంటే ప్రదర్శన ముఖ్యం’ అని వినేశ్ చెప్పినట్టు అకోస్ రాసుకొచ్చాడు. కాగా, తన అనర్హతను సవాల్ చేస్తూ వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(కాస్)‌ను ఆశ్రయించగా.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. జాయింట్ మెడల్ ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను కాస్ కొట్టివేసింది. 

Tags:    

Similar News