ఏ+ కేటగిరీలోనే రోహిత్, కోహ్లీ?.. అతనికి చోటు ఖాయమేనా?

బీసీసీఐ టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ 2025-26 జాబితాను త్వరలో ప్రకటించనుంది.

Update: 2025-04-01 19:08 GMT
ఏ+ కేటగిరీలోనే రోహిత్, కోహ్లీ?..  అతనికి చోటు ఖాయమేనా?
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ 2025-26 జాబితాను త్వరలో ప్రకటించనుంది. దీనిపై కసరత్తు చేస్తున్న బోర్డు ఏ క్షణంలోనైనా వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఏ+ గ్రేడ్‌లో ఉన్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్ట్‌లో వారిద్దరికి డిమోషన్ ఇచ్చి ఏ గ్రేడ్‌లో చేర్చనున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే, తాజాగా బీసీసీఐ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. రోహిత్, కోహ్లీలను ఏ+ గ్రేడ్‌లోనే కొనసాగించే అవకాశం ఉంది. ‘టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ రోహిత్, కోహ్లీలు ఏ+ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లోనే కొనసాగుతారు. వారిద్దరూ దిగ్గజ ప్లేయర్లు. వారికి బోర్డు తగిన గౌరవం ఇస్తుంది. శ్రేయస్ అయ్యర్ తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి వస్తాడు.’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో దేశవాళీ క్రికెట్ ఆడని కారణంగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను దేశవాళీలో ఆడి సత్తాచాటాడు.

రంజీ ట్రోఫీలో 480 రన్స్‌తో రాణించిన అతను.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 345 పరుగులు విజయ్ హాజరే ట్రోఫీలో 325 రన్స్ చేశాడు. ఇటీవల భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 243 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లను బోర్డు నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. ఏ+ గ్రేడ్ ప్లేయర్లు వార్షిక వేతనంగా రూ. 7 కోట్లు అందుకుంటారు. ఏ గ్రేడ్‌‌, బి గ్రేడ్, సి గ్రేడ్ ప్లేయర్లకు బోర్డు వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. కోటి చెల్లిస్తుంది.


Tags:    

Similar News